భరించలేని తలనొప్పి.. ఆపిల్‌కి ఉప్పురాసి ..

అబ్బా.. ఏంత తలనొప్పో.. తల పగిలిపోతోంది. ఓ టాబ్లెట్ పడితే కానీ తగ్గేలా లేదంటూ ఎవరు ఏది చెబితే ఆ మాత్ర వేసేసుకుంటూ ఉంటారు. ఇలా రోజూ తలనొప్పితో బాధపడేవారు కూడా ఉంటారు. మాత్రలతో పని లేకుండా కొన్ని చిన్న చిన్న చిట్కాలతో తలనొప్పికి చెక్ పెట్టేయొచ్చంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం..

* గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతుంటే క్రమంగా తలనొప్పి తగ్గిపోతుంది.
* యూకలిప్టస్ ఆయిల్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. దాన్ని తీసుకుని నుదుటిపై మసాజ్ చేసుకుంటే ఉపశమనం వస్తుంది.
* ఆవు పాలను వేడి చేసుకుని తాగితే కూడా తలనొప్పి ఈజీగా తగ్గిపోతుంది.

* గంధపు చెక్కని అరగదీసి ఆ పేస్ట్‌ని నుదుటిపై రాసి కాసేపు విశ్రాంతి తీసుకుంటే నొప్పి తగ్గుతుంది.
* కొబ్బరి నూనెను వేడి చేసి (డైరక్టుగా నూనె గిన్నెను స్టౌ మీద పెట్టకూడదు వేడి నీటిలో గిన్నెపెట్టి అందులో కొద్దిగా కొబ్బరి నూనె వేయాలి అది వేడైన తరువాత వాడాలి) ఆనూనెతో మసాజ్ చేసుకున్నా కూడా తలనొప్పి తగ్గుతుంది.
* వెల్లుల్లిని మెత్తగా చేసి ఆ రసాన్ని కొద్దిగా తాగితే తలనొప్పి తగ్గుతుంది.

* కాళ్లను వేడినీటిలో ఉంచుకోవడం వల్ల కూడా తలనొప్పి తగ్గుతుంది. కుర్చీలో కూర్చొని ఓ చిన్న టబ్‌లో గోరు వెచ్చని నీరు, అందులో కాస్త రాళ్ల ఉప్పు వేసి కాళ్లు పెడితే తలనొప్పి తగ్గి హాయిగా ఉంటుంది.
* ఆపిల్‌కి కాస్త ఉప్పు రాసుకుని తింటే కూడా తలనొప్పి తగ్గిపోతుంది. ఓ పావు గంట ఆగి వేడి పాలు తాగితే తలనొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తుంటే తలనొప్పి నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.
* గ్రీన్ టీ ద్వారా కూడా తలనొప్పి తగ్గుతుంది. ఇందులో ఓ స్పూన్ తేనె దానితో పాటు కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకుని తాగి కాసేపు రెస్ట్ తీసుకుంటే నొప్పి తగ్గుతుంది.