మ్యూచువల్‌ ఫండ్స్‌ రివైండ్

పెట్టుబడుల ప్రధాన లక్ష్యం సంపదను సృష్టించడం. స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని ఆశించడం సహజం. అయితే మార్కెట్‌ ఓనమాలు కూడా తెలియకుండా నేరుగా స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెడితే నిండా మునగడం ఖాయం. అందుకే చిన్న ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌పై దృష్టి సారిస్తున్నారు. ఈ ఏడాది ఈ రంగం ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..

స్టాక్‌ మార్కెట్లో తీవ్ర అనిశ్చితి నెలకొనప్పటికీ 2018లో మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పర్వాలేదనిపించాయి. ఆస్తుల విలువ 13 శాతం పెరిగింది. 2017లో 21.26 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న మొత్తం ఆస్తులు 2018 చివరినాటికి 24.03 లక్షల కోట్లకు పెరిగాయి. అయితే 2017లో 5.4 లక్షల కోట్లు ఉన్న పెట్టుబడులు.. 2018లో 3 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో పెట్టుబడుల విలువ క్షీణించింది. హౌజింగ్‌ ఫైనాన్స్‌ సెక్టార్‌ సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సీలు, IL&FS సంక్షోభం వంటి ఇబ్బందులతో లిక్విడ్‌ ఫండ్‌ల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయాయని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.

భారీగా పెరిగిన సిప్‌లు

సిప్‌ల ద్వారా 2017లో నెలకు సగటున రూ.4,950 కోట్లను చిన్న ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారు. అయితే 2018లో నెలకు సగటున 10 లక్షల కొత్త సిప్‌లు అదనంగా వచ్చి చేరాయి. వీటి ద్వారా నెలకు సగటున 6,700 కోట్లకుపైగా పెట్టుబడులు మార్కెట్లోకి రాగా ఏడాది మొత్తం మీద వీటి విలువ 80,600 కోట్ల రూపాయలుగా ఉంది. క్రూడాయిల్ ధర పెరగడం, రూపాయి పతనం, మార్కెట్‌లో ఒడిదొడుకులను చిన్న ఇన్వెస్టర్లు పెద్దగా పట్టించుకోలేదు. పన్ను ఆదా కోసం ELSSపైనా చిన్న ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. పన్ను ఆదా పథకాల్లో అన్నింటికన్నా తక్కువ వ్యవధి ఉండటం వీటికి కలిసొచ్చింది. బ్యాలెన్స్‌డ్‌ విభాగంలోనూ పెట్టుబడుల సంఖ్య అధికంగానే ఉంది.

ఇక 2018లో ఇన్వెస్టర్లకు లాభాలను అందించింది కొన్ని ఫండ్లే. వీటిలో అధికభాగం ఐటీ, టెక్నాలజీ ఫండ్లే ఉన్నాయి. రూపాయి బలహీనపడటంతో ఐటీ కంపెనీల షేర్లు ఉరకలెత్తడమే దీనికి కారణం. ఇక మ్యూచువల్‌ ఫండ్లలో మరింత పారదర్శకత పెంచేందుకు 2018లో సెబీ పలు చర్యలు తీసుకుంది. ముఖ్యంగా టీఈఆర్‌ని తగ్గించి, వాటిపై పరిమితి విధించింది. దీంతోపాటు మ్యూచువల్‌ ఫండ్లను విక్రయించే ట్రయల్‌ కమీషన్‌ తప్ప వారికి ఎలాంటి అదనపు చెల్లింపులు ఇవ్వకూడదని సెబీ స్పష్టం చేసింది