కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టిన ఇద్దరు బౌలర్లు

indian-bowlers
indian-bowlers

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ కొనసాగించిన ఆసీస్‌ మరో మూడు పరుగులు మాత్రమే జోడించి, చివరి రెండు వికెట్లు కోల్పోయింది. ఫలితంగా భారత్ 137 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా భారత్‌ టెస్టుల్లో 150వ విజయాన్ని నమోదు చేసుకుంది.

ఐదో రోజు ఆటకు వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం పడడంతో పాటు, పిచ్ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశాలు ఉండడంతో కోహ్లీ.. బుమ్రా, ఇషాంత్‌తో బౌలింగ్ దాడి ప్రారంభించాడు. వీళ్లిద్దరూ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకుని చెరో వికెట్ తీశారు. బుమ్రా కమ్మిన్స్ వికెట్ తీయగా, ఇషాంత్ లియాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆసీస్ 261 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రా, జడేజా తలో మూడు, ఇషాంత్, షమీ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ రెండు జట్ల మధ్య నాలుగో టెస్టు జనవరి మూడు నుంచి సిడ్నీలో ప్రారంభం కానుంది.