బంగ్లాదేశ్‌లో హింసాత్మకంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికలు

బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. అధికార అవామీ లీగ్‌కు యూత్‌ విభాగమైన జుబో లీగ్‌ జనరల్‌ సెక్రటరీ మహ్మద్‌ బషీరుద్దీన్‌ ప్రాణాలుకోల్పోయారు. అవామీ లీగ్‌ పార్టీ, ప్రతిపక్షం బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణల్లో 14 మంది చనిపోగా.. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు.

దాదాపు 40 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్‌లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆరు లక్షలకు పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ఐనప్పటికీ, అధికార అవామీలీగ్, విపక్ష బీఎన్‌పీ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. క్వాఖలి ప్రాంతంలో అవామీ లీగ్ యువజన విభాగం జుబో లీగ్‌కు, ప్రధాన ప్రతిపక్షం బీఎన్‌పీకి మధ్య గొడవలు జరిగాయి. ఆ కొట్లాట అంతకంతకూ ముదిరి కాల్పులకు దారి తీసింది.

రంగామతిలోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద బీఎన్‌పీ నిరసనకారులతో తలెత్తిన ఘర్షణలో అవామీ లీగ్‌ యూత్‌ ఫ్రంట్‌ నాయకుడు మహ్మద్‌ బషీరుద్దీన్‌ చనిపోయారు. ఈయన తన అనుచరులతో పోలింగ్‌ స్టేషన్‌కు వెళ్తుండగా.. బీఎన్‌పీ మద్దతు దారులు వీరిపై దాడులు చేశారు.

తాజా ఎన్నికల్లో అవామీలీగ్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలు హోరాహోరీగా పోరాడాయి. నాలుగోసారి గెలవాలని అవామీలీగ్ చీఫ్ షేక్ హసీనా విస్తృతంగా ప్రచారం చేశారు. అవామీ లీగ్‌ను గట్టిగా ఎదుర్కొనేందుకు బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పారీ ఈసారి 20 చిన్నా, చితక పార్టీలను కలుపుకొని జాతీయ ఐక్య సంఘటన పేరిట పోటీ చేసింది.