జున్నులో ఎన్నో పోషకాలు.. తరచుగా తీసుకుంటే అనేక..


గేదె లేదా ఆవుకి బుజ్జి దూడ పుడితే తల్లికి వచ్చే మొదటి పాలను జున్ను పాలు అంటారు. మొదటి మూడు నాలుగు రోజులు తల్లి నుంచి బిడ్డకి కొన్నే పాలు పట్టి మిగతావి మనకోసం వాడేస్తుంటాం. ఇవి చాలా రుచిగా ఉంటాయని అందరూ ఇష్టంగా తింటారు. జున్ను పాలలో రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే పోషకాలు కూడా ఎన్నో ఉన్నాయి.

మరి ఇన్ని ప్రయోజనాలున్న జున్ను తినడం నగర వాసికి సాధ్యం కాదు. పల్లె నుంచి ఎవరైనా వస్తుంటే ఏం తెచ్చినా తేకపోయినా జున్ను పాలు తెచ్చేయమని చెప్పండి. అమ్మ ప్రేమంత కమ్మగా ఉంటాయి జున్నుపాలు. అవకాశం వస్తే అస్సలు వదులుకోవద్దు. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అందించే జున్నులో లభించే మరిన్ని పోషకాలు..

  • జున్నుపాలలో కాల్షియం ఎక్కువగా ఉండడంతో దంతాలకు, ఎముకలకు ఎంతో మేలు కలుగజేస్తుంది. గర్భిణీలు జున్ను తీసుకుంటే బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.
  • విటమిన్ డి లోపంతో బాధపడేవారు జున్ను తరచుగా తీసుకుంటూ ఉంటే ఆ లోపాన్ని సరిచేసుకోవచ్చు. ఆస్టియోపోరోసిస్ రాకుండా నివారించొచ్చు.
  • రక్తపోటుతో బాధపడేవారు కూడా జున్ను తీసుకోవచ్చు. బరువు పెరగాలనుకునేవారు జున్ను తింటే మంచిది. ఇందులో ప్రొటీన్, కొవ్వు అధికంగా ఉంటుంది.
  • జున్నులో ఉండే విటమిన్ బి2 జీవక్రియలు సరిగ్గా జరిగేందుకు దోహదపడుతుంది. చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది.
  • జున్నులో ఉండే విటమిన్ ఎ కారణంగా శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పటిష్ట పడుతుంది.