తెరుచుకున్న శబరిమల ఆలయ ద్వారాలు.. కొండపైకి మొదలైన యాత్ర

sabarimala

శబరిమల ఆలయ ద్వారాలు మళ్లీ తెరుచుకున్నాయి. మకరజ్యోతి సందర్భంగా వచ్చే భక్తులంతా అయ్యప్ప దర్శనానికి తరలి వెళ్తున్నారు. ఆలయ ప్రధాన తంత్రి వీఎన్‌ వాసుదేవన్‌ నంబూద్రి పూజా కార్యక్రమాలు చేశాక.. ఆదివారం సాయంత్రం కట్టుదిట్టమైన భద్రత మధ్య మళ్లీ కొండపైకి యాత్ర మొదలైంది. ఈసారి 21రోజుల పాటు ఆలయ ద్వారాలను తెరిచి ఉంచుతారు. మాలధారులంతా ఇరుముడులతో పదునెట్టాంబడి మీదుగా సన్నిధానానికి వెళ్తున్నారు. జనవరి 14న మకరజ్యోతి దర్శనం ఉంటుంది. జనవరి 20న ఉదయాన్నే మళ్లీ తిరిగి గుడి మూసేస్తారు.

శబరిమలకు అన్ని వయసుల మహిళల్ని అనుమతించాలన్న సుప్రీం తీర్పుతో ఈసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు బందోబస్తు మధ్య కొందరు ఆలయంలోకి వచ్చేందుకు చేసిన ప్రయత్నాన్ని భక్తులు అడ్డుకున్నారు. 41రోజుల మండల పూజల సందర్భంగా ప్రతిరోజూ ఏదో ఒక నిరసనతో అక్కడ వాతావరణంలో అలజడి రేగింది. ఈసారి మకరవిళక్కుతో దర్శనాలు చివరి దశకు చేరడంతో.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.