చలికి చెక్ పెట్టే ‘పల్లీ చెక్క’.. పోషకాల గని

చలి చంపేస్తుంది.. రాత్రయితే రగ్గు కప్పుకుని వెచ్చగా పడుకోవచ్చు.. పగలు పని చేసుకోవాలి కదా మరి ఎలా.. చలికి వణికిపోకుండా ఒంట్లో కొంచెం వేడిగా వుంటే ఎంత బావుంటుంది.. వేడి వేడి టీ ఎన్ని సార్లని తాగుతాం.. ఎక్కువ తాగితే గ్యాస్ ఫామ్ అవుతుంది.. పోనీ వేడి వేడి మిర్చి బజ్జీ.. అది సాయింత్రం అయితేనే బావుంటుంది.. అయినా నూనెలో ముంచి తీసిన బజ్జీలు తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది..

మరేంచెయ్యాలి అంటే.. పల్లీ చెక్క తింటే చలి పులికి చెక్ పెట్టేయొచ్చంటున్నారు. రుచికి.. రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఒంట్లో వేడి పుట్టించే పల్లీ చెక్కను రోజూ కొంచెం తీసుకుంటూ ఉంటే ఆరోగ్యంతో పాటు అనేక రోగాలు కూడా మన దరిచేరవంటున్నారు. పల్లీలు తరచుగా తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ బలపడడంతో పాటు గుండె నాలుగు కాలాల పాటు ఆరోగ్యంగానూ ఉంటుంది. మరి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు..

వేరుశనగలో ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్లతో పాటు శరీరానికి కావల్సిన బోలడు పోషకాలు ఉంటాయి. బెల్లంతో కలిపి వీటిని తీసుకోవడం వలన రక్తహీనత దూరం అవుతుంది.
మధుమేహం ఉన్నవారు మినహా మిగిలిన వారు రోజుకు 20 గ్రాముల బెల్లం తింటే శరీరానికి మేలు చేస్తుంది. బెల్లంలో ఇనుము, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి.

చలికాలంలో బెల్లం, వేరు శనగ కలిపి తింటే బోలెడు ప్రయోజనాలు ఉంటాయి.
మహిళలకు వేధించే రుతు సమస్యలకు చక్కటి పరిష్కారం. మంచిది కదా అని ఎక్కువ తీసుకోకూడదు.
పల్లీల్లో మాంసకృత్తులు, పీచు పదార్థాలు, పిండి పదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతే కాకుండా తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేసే శక్తి పల్లీలకు ఉంది.
వేరు శనగ గింజలో 45-50 శాతం మాంసకృత్తులు, 26.1 శాతం పిండి పదార్థాలు, 3 శాతం పీచు పదార్థాలు ఉంటాయి. అంతే కాకుండా అవసరమైన ఆమ్లాలు, లైసిన్, త్రియోనైన్, వాలిన్, మిథియోనైన్, సిస్టిన్, లూయసిన్, ఐసోల్యూసిన్, ఫినైల్ అలనైన్, తైరోసిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. వేరుశనగ నూనెలో కొలస్ట్రాల్, సాచురేటెడ్

కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు తక్కువగా ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలున్న వారు కూడా డాక్టర్ సలహాతో ఈ నూనెను నిర్భయంగా వాడొచ్చు. ప్రొటీన్ లోపంతో బాధ పడే చిన్నారులకు పల్లీ చెక్క రోజూ పెడితే ప్రొటీన్ లోపాన్ని అధిగమించవచ్చు.