రోజూ ఓ కప్పు ఛాయ్.. మనసుకి ఉల్లాసం.. ఎముకలకు బలం

ఉదయం లేవగానే ఓ కప్పు వేడి వేడి ఛాయ్ పడితే బద్దకం వదిలి పోతుంది. మనసు ఉత్సాహంగా ఉరకలేస్తుంది. ఆ రోజు పనులకు మనిషిని సన్నద్ధం చేస్తుంది. అంతే కాదండోయ్.. తాజాగా మరో కొత్త వార్తను కనిపెట్టారు శాస్త్రజ్ఞులు.

నిత్యం టీ తాగే అలవాటు ఉన్నవారి ఎముకలు కూడా దృఢంగా ఉంటాయంటున్నారు. ఎముకలు పెళుసుబారి విరిగిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని టీతాగి మరీ చెబుతున్నారు. 30 ఏళ్లుగా టీ తాగుతున్న వారిపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని కనిపెట్టారు.

చైనాలోని పెకింగ్ యూనివర్సిటీకి చెందిన పబ్లిక్ హెల్త్ స్కూల్ పరిశోధకులు ఇటీవల ఈ కొత్త విషయాన్ని కనుగొన్నారు. నిత్యం గ్రీన్ టీ లేదా సాధారణ టీని తాగుతున్న వారిపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో భాగంగా దాదాపు 4 లక్షల 53 వేల 625 మందిని ప్రశ్నించారు.

టీ తాగే అలవాటు లేని వారిలో కంటే టీ తాగే వారిలో కీళ్ల ఎముకలు విరిగిన సందర్భాలు చాలా తక్కువ అని వారు తేల్చారు. కనుక నాకు టీతాగే అలవాటు లేదు అని చెప్పకుండా రోజూ ఓ కప్పు చాయ్ తాగేసి ఉల్లాసంగా ఉండమంటున్నారు. ఎక్కువ తాగితే ఎసిడిటీ ఫామ్ అవుతుంది. మంచిదైనా లిమిట్‌లో ఉంటేనే ఆరోగ్యం. లేదంటే లేని పోని అనారోగ్యాలు తెచ్చిపెట్టుకున్నవారవుతారు. సో.. అదండీ సంగతి.