మొన్న కనకదుర్గ, బిందు.. ఇప్పుడు శశికళ..

invisible-gorilla-sabarimala-how-science-helped-two-women-enter-temple

మొన్న కనకదుర్గ, బింధు.. ఇప్పుడు శశికళ.. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన మహిళల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పుడు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మరో మహిళ వెళ్లిందని పోలీసులు నిర్ధారించారు. శ్రీలంకకు చెందిన 46ఏళ్ల శశికళ అనే మహిళ ఆలయంలో అయ్యప్పను దర్శించుకుని పూజలు నిర్వహించారని చెప్తున్నారు. అయితే శశికళ మాత్రం తాను ఆలయంలోకి వెళ్లలేదని, 18 మెట్ల వద్దే పోలీసులు తనను అడ్డుకున్నారని చెప్తోంది. సీసీ టీవీ ఫుటేజ్‌లో మాత్రం ఆమె ఆలయ ప్రవేశం చేసినట్టు స్పష్టంగా కనిపించింది.

Also read : పోరాటంలో ఏపీ సీఎం చంద్రబాబు వాయిస్ రెయిజ్ అవుతోంది..

మరోవైపు అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం నేపథ్యంలో కేరళ రణరంగంగా మారిపోయింది. 50ఏళ్ల లోపు ఆడవాళ్లు ఆలయంలోకి ప్రవేశించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పోలీసులు దాదాపు 1400 మందిని అరెస్ట్‌ చేశారు. 800ల మందిపై కేసులు నమోదు చేశారు. సుమారు 700 మందిని ముందస్తు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నా.. ఆందోళనలు ఏ మాత్రం తగ్గడం లేదు. శుక్రవారం ఉదయం మలబార్‌ దేవస్వామ్‌ బోర్డు సభ్యుడి ఇంటి వద్ద నాటు బాంబులు విసిరారు కొందరు. పథానంతిట్ట ప్రాంతంలో కూడా అలాంటి బాంబులు పేలాయని, ఇలాంటి మరికొన్ని ఘటనలు జరిగాయని పోలీసులు వివరించారు. కన్నూరులోని బీజేపీ కార్యాలయాన్ని తగలబెట్టారు. తిరువనంతపురం, పాలక్కాడ్‌, మలపురం, కన్నూర్‌, కోజికోడ్‌ తదిరత ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీ ఛార్జీ, వాటర్‌ ఫిరంగుల ద్వారా ఆందోళనకారులను చెదరగొట్టారు.

మరోవైపు సుప్రీం కోర్టు తీర్పును ఉపయోగించుకునే తాము పోలీసుల సహాయంతో ఆలయంలోకి ప్రవేశించామని కనకదుర్గ, బింధులు వివరణ ఇచ్చారు. తమకు ఏ పార్టీ మద్దతు లేదన్నారు. ఒకే భావజాలం ఉన్న తామిద్దరం స్వామిని దర్శించుకోవాలనుకున్నామని, కాని బీజేపీ కార్యకర్తలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యనించారు.

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆలయంలోకి వచ్చిన మహిళలకు రక్షణ కల్పించడం ప్రభుత్వం బాధ్యతని సీఎం పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. రాజ్యాంగ బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించిందని చెప్పారు. శబరిమలను ఘర్షణ జోన్‌గా మలిచేందుకు బీజేపీ, ఆరెస్సెస్‌లు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు ప్రేరేపించే హింసను కఠినంగా ఎదుర్కొంటామని స్పష్టం​చేశారు.

శబరిమలలో మహిళల ప్రవేశం రాజకీయ రణరంగంగా మారింది. కేరళ సచివాళయం ఎదుట బీజేపీ, సీపీఎం కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. శబరిమల ఘటన నేపథ్యంలో ఆందోళనకారులు ఏడు పోలీస్‌ వాహనాలు, 79 కేఎస్‌ఆర్‌టీసీ బస్సులను ధ్వంసం చేశారని, 39 మంది పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఇటు ప్రభుత్వం తీరుకు నిరసగా హిందూ సంఘాలు, బీజేపీ, ఆరెస్సెస్‌ భగ్గుమంటున్నాయి.