ఆమె వర్కవుట్ల ఖరీదు గంటకు రూ.20 వేలు

మనసు ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ప్రశాంతత ఉండాలి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక ఆరోగ్యం బావుండాలి. అనుకున్నది సాధించాలంటే రెండూ అనుకూలించాలి. శారీరక సమస్యలకు చికిత్స తీసుకున్నా మానసికంగా మరో అంశం ఆమెను కృంగదీసింది. దీంతో దాన్ని బాగు చేసుకోవడం కోసం తనకు తానే సన్నద్ధమైంది.

అందుకోసం వర్కవుట్లను ఎంచుకుంది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ అమెరికన్ గాయని సెలీనా గోమేజ్‌కు ల్యూపస్ వ్యాధి సోకింది. దాంతో ఒక కిడ్నీ పాడైపోయింది. ఆమె బాధను అర్థం చేసుకున్న ప్రాణ స్నేహితురాలు సెలీనాకు కిడ్నీ దానం చేసి మరు జన్మను ప్రసాదించింది.

దీన్నించి కోలుకుంటున్న తరుణంలోనే ఆమె ప్రియుడు, ప్రముఖ కెనడియన్ గాయకుడు జస్టిన్ బీబర్ సెలీనాను కాదని మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ సంఘటనతో సెలీనా మానసికంగా కృంగిపోయింది. కొన్నాళ్లపాటు మానసిక వ్యాధికి కూడా చికిత్స తీసుకుంది.

అయినా గాయనిగా పూర్వవైభవాన్ని సంతరించుకోవాలి, పలు వేదికలనెక్కి ప్రయాణం సాగించాలి, అభిమానులను అలరించాలంటే మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంది. అందుకోసం గంటకు 300 డాలర్లు (మన కరెన్సీలో రూ.20,989) ఖర్చుపెడుతూ వర్కవుట్లు చేస్తోంది. ఇప్పుడు మరింత అందంగా, మరింత ఆరోగ్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది గాయని సెలీనా.