పైసా ఖర్చులేకుండా ‘పైలెట్’ కావచ్చు.. ఇంటర్ పాసైతే చాలు

పదవతరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా.. ఇలా ఏ విద్యార్హత ఉన్నా ఎయిర్‌ఫోర్స్ రంగంలో ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. మంచి వేతనంతో పాటు, సంఘంలో మీకంటూ ఓ స్పెషల్ గుర్తింపు ఉంటుంది. వీటిలో ప్రవేశానికి ఆరు నెలలకు ఒకసారి అంటే జనవరిలో, ఆగస్టులో ప్రకటనలు వెలువడుతుంటాయి.

గంటల్లో ప్రపంచాన్ని చుట్టే గగన విహంగంలో పైలెట్ ఉద్యోగం చేయాలంటే ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు, ఆసక్తి, ఉత్సాహం ఉంటే పైసా చెల్లించకుండా పైలెట్ శిక్షణ పొందవచ్చు. ఇదే కాకుండా విమానాల నిర్వహణ, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ సిబ్బంది, ఎయిర్‌మెన్లు ఇలా ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి.

ఆఫీసర్ హోదాతో ప్లయింగ్ బ్రాంచ్ (పైలెట్) ఉద్యోగాలను యూపీఎస్సీ నిర్వహించే ఎన్‌డీఏ, సీడీఎస్‌ఈలతో పాటు ఏఎఫ్ క్యాట్, ఎస్ఎస్సీ స్పెషల్ ఎంట్రీ (స్త్రీ, పురుషులిద్దరు) ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ (పురుషులు) ద్వారా దక్కించుకోవచ్చు.

ఎన్టీఏ: మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తిచేసినవారు, ఆఖరి సంవత్సరం కోర్సు చదువుతున్న వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 16 నుంచి 19 ఏళ్ల లోపు ఉండాలి.
ఎత్తు: 162.5 సెం.మీ ఉండాలి.
ఎంపికైన వాళ్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణేలో శిక్షణతో పాటు బీటెక్ విద్య అభ్యసిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్న వారికి జేఎన్‌యూ, న్యూఢిల్లీ ఇంజనీరింగ్ డిగ్రీలను ప్రధానం చేస్తుంది. శిక్షణ అనంతరం ప్లయింగ్ ఆఫీసర్ హోదా పొందుతారు.
ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ: ఎన్సీసీ సీ సర్టిఫికెట్ ఉన్న వారికి ప్రత్యేకంగా ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా ప్లయింగ్ బ్రాంచ్‌లో అవకాశం కల్పిస్తున్నారు. పురుషులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. కనీసం 60 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి.
వెబ్‌సైట్‌: www.careerairforce.nic.in