వణికిస్తున్న తుఫాన్..జన జీవనం అస్తవ్యస్తం

Tropical-Storm-Pabuk

థాయ్‌లాండ్‌పై పుబక్‌ తుఫాన్‌ విరుచుకుపడింది. తుఫాన్‌తో థాయ్‌లాండ్‌ పశ్చిమ తీరం అతాలకుతలమైంది. తీర ప్రాంత గ్రామాలు, పట్టణాలు వణికిపోయాయి. భారీ ఈదురు గాలులతో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి. ఇంటి పైకప్పుల ఎగిరిపోయాయి. మరోవైపు తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేసింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. మరో రెండు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని థాయ్‌లాండ్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటు పుబక్‌ తుఫాన్‌ అండమాన్, నికోబార్ దీవుల్లో కూడా ప్రభావం చూపుతోంది. ఈ నెల 5 నుంచి 7 వరకు భారీ వర్షాలు కురుస్తాయని కోల్‌కతాలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంపై పోర్ట్ బ్లెయిర్‌కు 1000 కిలోమీటర్ల దూరంలో పుబక్ కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.