పండక్కి ఊరెళ్తే పక్కింటి వారికి చెప్పకపోయినా.. వీరికి మాత్రం..

ఉరుకుల పరుగుల నగర జీవితం. పక్కింట్లో ఎవరున్నారో కూడా తెలియదు. అపార్ట్‌మెంట్‌లో నివసించే భార్యా భర్తలు ఉద్యోగస్తులైతే పగలు, రాత్రి తలుపులు వేసే ఉంటాయి. ఊళ్లో ఉన్నారో లేదో కూడా తెలియదు. మరి నిజంగానే ఊరెళితే.. పండగ పేరుతో నాలుగు రోజులు సెలవులు వచ్చాయి కదా అని ఊరెళ్తే పక్కింటి వారికి చెప్పకపోయినా పోలీసులకు చెప్పమంటున్నారు సైబరాబాద్ పోలీస్ అధికారులు.

తాళం వేసి ఉన్న ఇళ్ళను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న వారిని అదుపులో పెట్టేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఈసారి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యమిచ్చే దిశగా ప్రజల భాగస్వామ్యాన్ని అధికంగా కోరుతున్నారు. ఇందుకోసం స్టేషన్ పరిధిలోని ప్రజలు, అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడి నేర నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు.