ఆసీస్‌ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా

india-declare-6227-sydney-test

ఆసీస్‌ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. తొలిసారిగా అక్కడ టెస్ట్ సిరీస్ కైవసం చేసుకుని సత్తా చాటింది. కోహ్లీ సారధ్యంలోని జట్టు.. సిరీస్ గెలుచుకోవడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సిడ్నీ టెస్ట్ వర్షం కారణంగా డ్రాగా ముగియడంతో భారత్ ఆధిపత్యానికి కాస్త గండిపడినా 4 టెస్ట్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇప్పటివరకూ 11 సార్లు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించినా ఒక్కసారి కూడా విజయం రుచి చూడలేదు. 8సార్లు ఓటమి ఎదురైతే.. 3 సార్లు సిరీస్‌లు డ్రా అయ్యాయి. ఈ చరిత్రను తిరగరాస్తూ భారత్ జట్టు సిరీస్ గెలుచుకుంది.

Also Read : కొత్త రూల్.. ఇక నుంచి ట్రైన్ ఎక్కాలనుకుంటే..

ఈసారి పర్యటనలో తొలి టెస్టు నుంచే దూకుడు ప్రదర్శించారు మన కుర్రాళ్లు. తొలి టెస్ట్‌లో 31 పరుగుల తేడాతో నెగ్గింది టీమిండియా. రెండో టెస్ట్ ఆసీస్‌కి చేజారినా, మూడో టెస్ట్‌లో మళ్లీ కంగారూలకు షాక్ ఇస్తూ 137 పరుగులతో విజయం సాధించింది. ఇక సిడ్నీ టెస్టులోనూ భారత్ విజయం ఖాయమనే అంతా అనుకున్నారు. కానీ వర్షం కారణంగా నిన్న ఆట ముందుకు సాగలేదు. ఫాలోఆన్ ఆడుతున్న ఆసీస్‌ను కట్టడి చేసి, విక్టరీ కొట్టాలని కోహ్లీ భావించాడు. ఐతే వర్షం కారణంగా మ్యాచ్ డ్రా అయ్యింది. దీంతో.. 4 టెస్ట్‌ల సిరీస్‌ 2-1తో టీమిండియా వశమైంది.

తొలిసారి ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిందంటే ఈ క్రెడిట్‌ కెప్టెన్ కోహ్లీతోపాటు మరో ముగ్గురికి ఇవ్వాల్సి ఉంటుంది. పుజారా అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 3 సెంచరీలు చేసి మొత్తం 521 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ రిషభ్‌ పంత్ కూడా సత్తా చాటాడు. ఆసీస్ గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించారు. సిడ్నీ టెస్ట్‌లో పంత్ చెలరేగి ఆడాడు. 21 ఏళ్ల ఈ కుర్రాడిని ఇప్పుడంతా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అటు ఒక సెంచరీ, 1 హాఫ్ సెంచరీతో 282 పరుగులు చేసిన కోహ్లీ కూడా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 4 టెస్టుల్లో 21 వికెట్లతో చెలరేగిన బూమ్రా కూడా సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.