డాలర్ డ్రీమ్స్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

trump

మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం, విదేశీ యువత డాలర్ డ్రీమ్స్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరించిన ట్రంప్, మొదటిసారి అందుకు విరుద్దంగా మాట్లాడారు. అమెరికాలో ఉత్తమ విద్యా సంస్థల్లో చదువు ముగించుకున్న విద్యార్థులు దేశం వదిలి వెళ్లి పోవద్దని ట్రంప్‌ కోరారు. ప్రతిభావంతమైన విద్యార్థులంతా అమెరికాలోనే ఉండి కంపెనీల అభివృద్ధికి, దేశాభివృద్ధి దోహదం చేయాలని పిలుపునిచ్చారు. అమెరికాలోని పాత వలస విధానాలు హాస్యాస్పదంగా ఉన్నాయని, వాటి కారణంగా ప్రతిభావంతులను కోల్పోతున్నామని చెప్పారు.

Also Read : కొత్త రూల్.. ఇక నుంచి ట్రైన్ ఎక్కాలనుకుంటే..

చట్టబద్ధమైన వలస విధానాల్లో ఉన్న లొసుగులను తొలగించి ప్రతిభ ఆధారిత వలసలను ప్రోత్సహిస్తామని ట్రంప్ చెప్పారు. ప్రతిభావంతులు అమెరికా నుంచి వెళ్లిపోకుండా చూడాలని ప్రముఖమైన కంపెనీల ఓనర్లు కూడా తనకు ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారని తెలిపిన ట్రంప్, ఈ విషయంపై డెమోక్రటిక్‌ కాంగ్రెషనల్‌ నేతలతో చర్చించానన్నారు. గొప్ప కంపెనీలను, ప్రతిభావంతులను వదులుకోబోమని స్పష్టం చేశారు. అమెరికాలో ఆశ్రయం కావాలని కోరుకునే వారికి చట్టబద్ధమైన విధానాలు ఉన్నాయన్నారు.

ఇక, మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టి తీరతానని ట్రంప్ మరోసారి తేల్చి చెప్పారు. మెక్సికో బోర్డర్‌లో గోడ నిర్మాణానికి కాంగ్రెస్‌ నిధులు మంజూరు చేయకపోతే జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తానని ట్రంప్‌ హెచ్చరించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తనకు ఈ విషయంలో విశేష అధికారాలున్నాయన్న ట్రంప్, పరిస్థితి అంతవరకు రాకపోవచ్చు అని చెప్పారు. కాంగ్రెస్ అంగీకారంతోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఐతే, ప్రతిష్టంభన ఇలాగే ఉంటే ప్రభుత్వ షట్‌డౌన్‌ నెలలు లేదా సంవత్సరాల పాటు కొనసాగొచ్చని డెమోక్రటిక్‌ సభ్యులకు స్పష్టం చేశారు. గోడ నిర్మాణంతోనే అక్రమ వలసలకు చెక్ పడుతుందని తేల్చి చెప్పారు.