మాజీ మిస్‌పై మనసు పారేసుకున్న మలేషియా రాజు.. చివరికి

దేశాధినేతలైతే మాత్రం మాకూ మనసుంటుంది. దానికీ చిలిపి పనులు చేయాలని ఉంటుంది. అదే మా కొంప ముంచుతుందని ఆ సమయంలో అస్సలు గుర్తుకు రాదు. ఏంచేయమంటారు చెప్పండి.. దానికి మూల్యమే ఈ పదవీ త్యాగం అంటున్నారు మలేషియా రాజు 49 ఏళ్ల సుల్తాన్ ముహమ్మద్.

బుద్దిగా రాజ్యాన్ని పాలించక ఈ పాడు బుద్దులేంటి అని అన్నవారి నోళ్లు మూయించలేక తానే నోరు మూసుకుని సింహాసనం నుంచి దిగిపోయారు. 25 ఏళ్ల మాజీ మిస్ మాస్కో ఒక్సానా వోవోదినాను రాజు పెళ్లాడినట్లు రాజ్యమంతా కోడై కూస్తుండడంతో రాజాసనానికి గుడ్‌బై చెప్పవలసిన పరిస్థితి వచ్చింది.

అయితే ఇది రాజు పదవి నుంచి తప్పుకోవడానికి గల కారణంగా మాత్రం రాజభవనం వెల్లడించలేదు. మలేషియాకు 15వ రాజుగా వ్యవహరిస్తున్న సుల్తాన్ ముహమ్మద్ తన పదవికి రాజీనామా చేశారని మాత్రమే రాజభవన వర్గాలు వెల్లడించాయి.

బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన మలేషియాకు సుల్తాన్ ముహమ్మద్ 15వ రాజు. ఆయన 2016లో సింహాసనాన్ని అధిష్టించారు. కొన్ని వివాదాల నేపథ్యంలో ఇంత త్వరగా పదవి నుంచి వైదొలగవలసి వచ్చింది.