‘యన్‌.టి.ఆర్‌’ ఆడియో వేడుకను నిమ్మకూరులో అందుకే నిర్వహించలేదు : బాలయ్య

నిమ్మకూరులో కథానాయకుడు చిత్ర బృందానికి ఘనస్వాగతం లభించింది… బాలయ్యతోపాటు ‘యన్‌.టి.ఆర్‌’ చిత్ర దర్శకుడు క్రిష్‌, నటి విద్యాబాలన్‌, నటుడు కల్యాణ్‌రామ్‌, సుమంత్‌ తదితరులు ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నిమ్మకూరు చేరుకున్నారు. ఎన్టీఆర్‌, బసవతారకం దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వాతావరణం అనుకూలించకపోవడంతో ‘యన్‌.టి.ఆర్‌-కథానాయకుడు’ ఆడియో వేడుకను నిమ్మకూరులో నిర్వహించలేకపోయామని, ఇప్పుడు సినిమా విడుదలకు ముందు తమ బంధువులు, అందర్నీ కలుసుకుని అమ్మానాన్నల ఆశీర్వాదాలు తీసుకోవడానికి వచ్చినట్టు పేర్కొన్నారు బాలకృష్ణ.

Also Read : ఎన్టీఆర్’కథానాయకుడు’కి క్లీన్ ‘యూ’ సిర్టిఫికెట్..

ఈ బయోపిక్‌ ఒక పార్టీకి, ఒక వర్గానికి పరిమితం కాదని.. అందరూ ఆదరించే నాయకుడు ఎన్టీఆర్‌ అన్నారు బాలయ్య. రెండు భాగాల్ని ఇంత త్వరగా తీయడం విశేషంగా పేర్కొన్న ఆయన రెండో భాగానికి సంబంధించి మరో పది రోజుల షూటింగ్‌ ఉందని తెలిపారు. తారక రామారావు గారి జీవిత కథను సినిమాగా తీయడం అనేది ఓ సంకల్పంగా పేర్కొన్నారు బాలకృష్ణ.

ఎన్టీఆర్‌ చిత్రంలో నటించడం తనకెంతో అనందాన్ని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు విద్యాబాలన్.. ఎన్టీఆర్‌ జీవితంలో భార్య, పిల్లల ప్రభావం ఎంత ఉందో ఈచిత్రంలో చూపించామని తెలిపారు కల్యాణ్ రామ్. మూడు రోజుల ముందేగానే అభిమానులకు సంక్రాంతికి పండుగ వస్తోందని అన్నారు.

నిమ్మకూరు నుంచి చిత్రబృందం తిరుపతి చేరుకుంది… రేణిగుంట విమానాశ్రయం వద్ద పెద్దఎత్తున అభిమానులు చిత్రబృందానికి ఘనస్వాగతం పలికారు.. కథానాయకుడు సినిమాలో ఏఎన్‌ఆర్‌ క్యారెక్టర్‌ వేయడం సంతోషంగా ఉందన్నారు నటుడు సుమంత్‌.. బాలకృష్ణతో కలిసి నటించడం ఒక గొప్ప అనుభూతని తెలిపారు.

చిత్రప్రమోషన్‌లో భాగంగా తిరుపతి వచ్చిన టీం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇప్పుడు మనం మన సంప్రదాయాల్ని, సంస్కృతుల్ని విస్మరిస్తున్నామని.. మరుగున పడి ఉన్న వాటికి మళ్లీ పదునుపెట్టి అందరికీ అందించే ప్రయత్నమే ఈ ‘యన్‌.టి.ఆర్‌’ సినిమా అన్నారు బాలయ్య.

Recommended For You