పిచ్చి పీక్స్.. ఆన్‌లైన్‌లో అవి కూడా..

జీవితమంటే ఆటలుగా ఉంది. పాముకి పాలుపోసి పెంచినా కోరల్లో విషముంటుంది. బుస కొట్టి కాటేసిందంటే ఛస్తారని తెలిసీ వాటితోనే ఆటలాడుతున్నారు. నెలరోజుల నించి ఏదో కుక్కపిల్లను పెంచుతున్నంత ఆనందంగా కొండచిలువను పెంచుతున్నాడు.

ఘట్‌కేసర్ మండలం చౌదరిగూడ గ్రామానికి చెందిన శరణ్‌మోసెస్ అనే యువకుడు. బ్రాంజ్‌బ్యాంక్ అనే స్నేక్‌ని పెంచడమే కాకుండా అతడి స్నేహితుడు ప్రవీణ్‌ని కూడా రమ్మని రోజూ దాంతో ఆటలు ఆడుకుంటూ ఫొటోలు దిగుతున్నారు. ఆనక వాటిని ఫేస్‌బుక్, వాట్సప్‌ల్లో పోస్ట్ చేస్తున్నారు. ఆసక్తి గల వారు కొనుక్కోవచ్చంటూ ఆన్‌లైన్‌లో ఓ ప్రకటన కూడా ఇచ్చారు.

ఈ విషయంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందడంతో యాంటీ పోచింగ్ స్క్వాడ్ టీమ్ వారిని అదుపులోకి తీసుకుని వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్-1972 కింద కేసు నమోదు చేశారు. అయితే వీరు పట్టుకున్న కొండ చిలువకు విషం ఉండదని అధికారులు తెలియజేశారు. దాంతో ధైర్యంగా రబ్బరు పాముతో ఆడుకున్నంత ఈజీగా ఆడేసుకున్నారు.

అయినా వారి ఆటలు కట్టిపెట్టిన అధికారులు వీటిని పట్టుకోవడం నేరంగా భావించారు. నిందితులకు జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధించనున్నట్లు తెలిపారు.