వైఎస్ బయోపిక్.. విజయమ్మ పాత్రలో ఒదిగిన..

రాజమౌళి చిత్రం బాహుబలిలో ‘కన్నా నిదురించరా’ అంటూ ప్రేక్షకుల్ని మైమరపించిన పాటలో నర్తించిన ఆశ్రిత వేముగంటి వైఎస్ బయోపిక్ ‘యాత్ర’లో ఓ మంచి ఛాన్స్ కొట్టేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మగా నటిస్తోంది ఈ చిత్రంలో.

చిత్ర యూనిట్ ఆమె లుక్‌కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. పాదయాత్ర సమయంలో వైఎస్‌కు సపర్యలు చేస్తున్న సీన్ అభిమానులను ఆకర్షిస్తోంది. విజయమ్మ రోల్‌లో ఆశ్రిత వంద శాతం సెట్ అయిందని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టీ వైఎస్ఆర్‌గా నటిస్తోన్న ఈ సినిమాను మహీ వీ రాఘవ డైరక్ట్ చేస్తున్నారు.. ‘ నా విధేయతని, విశ్వాసాన్ని బలహీనతగా తీసుకోకండి. నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకోగలిగాం కానీ.. జనాలకు ఏం కావాలో తెలుసుకోలేకపోయాం. తెలుసుకోవాలనుంది.. వినాలనుంది.. ఈ కడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలనుంది’.. అనే డైలాగ్స్ ట్రైలర్‌లో పొందు పరిచారు.

కాగా, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్సార్ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు పాత్రలో రావు రమేశ్ కనిపిస్తారు. ఈ చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.