ఆన్‌లైన్‌లో యూజుడ్‌ ఫోన్‌లు, వాహనాలను చూసి..

fake online ads
fake online ads

మోసపోయే వాడు ఉన్నంత కాలం మోసం చేసే వాళ్ళు ఉంటారు. అమాయకులను ముంచేయడానికి రోజుకో కొత్త దారులు వెతుకుతూ సక్సెస్‌ అవుతున్నారు కేడీలు. ఆన్‌లైన్‌ షాపింగ్‌పై యువత క్రేజ్‌ చూపిస్తుండడంతో.. వారి క్రేజ్‌ను కొంతమంది క్యాష్‌ చేసుకుంటున్నారు. OLX, క్విక్కర్‌, ఇతర ఆన్‌లైన్‌ వెబ్‌సైట్ల పేరుతో.. యువతను టార్గెట్‌ చేస్తూ మోసాలలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు.

అరచేతిలో స్మార్ట్‌ ఫోన్‌.. లెక్కలేనన్ని ఆఫర్లు.. పోటా పోటీ ప్రకటనలు.. కాలు బయట పెట్టకుండానే షాపింగ్‌.. అందుకే ఆన్‌లైన్‌ షాపింగ్‌కు రోజు రోజుకూ విపరీతమైన క్రేజ్‌ పెరిగిపోతోంది. ముఖ్యంగా యూత్‌ అంతా.. షాపింగ్‌కు వెళ్లడమే మరచిపోతున్నారు.. చేతిలో ఫోన్‌ పట్టుకుని.. ఆన్‌లైన్‌ షాపింగ్‌ యాప్‌ల్లో చక్కర్లు కొడుతున్నారు.. చివరికి లబోదిబో అంటున్నారు..

OLX, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఆన్‌లైన్‌ షాపింగ్‌ యాప్‌లకు విపరీతమైన క్రేజ్‌ ఉంది ఇప్పుడు. ముఖ్యంగా యువత, స్టూడెంట్స్‌ అంతా వీటిపై మోజు పెంచుకున్నారు. వారు చూపుతున్న క్రేజ్‌ను కేడీగాళ్లు క్యాష్‌ చేసుకుంటున్నారు.. ఆన్ లైన్ షాపింగ్ మాధ్యమాలే వేదికగా దోచుకుంటున్నారు.. ముఖ్యంగా ఏపీ వ్యాపార రాజధాని బెజవాడలో ఈ తరహా మోసాలు పెరిగిపోతున్నాయి..

క్విక్కర్ లాంటి వెబ్‌సైట్లకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా కొందరు అందులో తప్పుడు సమాచారం పెడుతున్నారు. ఆన్‌లైన్‌లో యూజ్‌డ్‌ ఫోన్‌లు, వాహనాల ఫోటోలు పెడుతున్నారు. అతి తక్కువ ధరకు అమ్ముతున్నట్టు ఫోటోలు పెట్టి అందర్నీ అట్రాక్ట్‌ చేస్తున్నారు. ఎవరైనా అవి కొనాలని ఆసక్తి చూపిస్తే.. వారితో మాట మాట కలిపి.. ఇంకాస్త తక్కువ ధరకే అమ్ముతామని బుట్టలో వేస్తున్నారు. అందుకు ముందుగానే తమ పేటిఎం అకౌంట్‌ ద్వారా నగదు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలా నగదు పే చేసిన తరువాత.. వస్తువు ఎప్పుడిస్తారని మెసేజ్‌ చేసినా.. అవతలవైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ ఉండడం లేదు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి.

చివరికి మోస పోయామని తెలుసుకొని, లబోదిబో అంటున్నారు బాధితులు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆన్‌లైన్‌ బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా అతి తక్కువ రేటుకే.. అన్ని ఫీచర్ల ఫోన్‌లను ఆన్‌లైన్‌ యాప్‌లో చూడగానే యువత ట్రాప్‌లో పడిపోతున్నారు. ఎలాగైనా ఫోన్‌ కొనేయాలనే ఆతృతలో అవతలి వ్యక్తులు పెట్టిన సమాచారం నిజమా? కాదా అని తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. గుడ్డిగా అవతలి వారు చెప్పిన మాయ మాటలు నమ్మి పేటీఎం ఇతర ఆన్‌లైన్‌ సైట్ల ద్వారా పేమెంట్‌ చేసేస్తూ చేతులు కాల్చుకుంటున్నారు. తరువాత మోసపోయామని తెలుసుకొని స్నేహితులకు తెలిస్తే చిన్నబోతామని.. తల్లిదండ్రులకు చెబితే మందలిస్థారని భయంతో కొందరు తమలో తామే కుమిలిపోతున్నారు. ఆయా వెబ్‌సైట్‌లు సైతం తమకు ఎలాంటి సంబంధం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి..