జనం మెచ్చిన నాయకుడు.. ‘కథానాయకుడు’.. రివ్యూ

కథలుగా చెప్పుకునే జీవితాలు కొన్నే ఉంటాయి. అలాంటి జీవితాలలో ఎన్టీఆర్ ఒకటి అనడంలో సందేహం లేదు. తెలుగు జాతి పౌరషంని తెలిపిన కథానాయుడుగా ఎన్టీఆర్ ని ఎప్పటికీ చరిత్ర మరిచిపోదు.
ఆకథను చెప్పేందుకు ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ ముందుకు రావడం ఏ కొడుకికీ దక్కని అదృష్టం.. ఏ తండ్రీ కీ కలగని గౌరవం ఈ ఎన్టీఆర్ కథానాయకుడు. మరి సినిమా ఎలాంటి ఎక్స్ పీరియన్స్ గా మారిందో చూద్దాం…

కథ:
బసవతారకం (విద్యాబాలన్) క్యాన్సర్ ట్రీట్ మెంట్ లో ఉంటుంది. ఆమె జీవితంలో మధుర జ్ఞపకాలతో మొదలైన గతం ఎన్టీఆర్ పార్టీ అనౌన్స్ మెంట్ వరకూ వెళుతుంది. ఈ మధ్య లో నందమూరి తారకరాముని జీవితంలో మలుపుల సమాహరమే ఎన్టీఆర్ కథానాయకుడు.

కథనం:
ఎన్టీఆర్ బయోపిక్ ని సినిమాగా తీద్దామనుకున్న తర్వాత ఎక్కడి నుండి కథ మొదలు పెట్టాలి అనే పాయింట్ నుండి ఏవేవి తెరమీదకు రావాలి అనే విషయంలో క్రిష్ చేసిన అధ్యయనం మెచ్చుకోవాల్సిందే.

ఎందుకుంటే రామారావు జీవితం నుండి చాలా సంఘటనలు కథలుగా ప్రాచుర్యం పొందాయి. వాటిలో ఏది తీసుకోవాలి అనే విషయంలో క్రిష్ తన ప్రతిభను చూపాడు. పెద్దగా తెలియని బసవతారకం పాత్రను ప్రధానంగా ఎన్టీఆర్ కథానాయకుడిలో నిలిపాడు. రామారావు జీవితంలో బసవతారకం అంటే ఏంటో ఈ సినిమా తో తెలుస్తుంది.

ముక్కుసూటితనం, నిజాయితీ, తన మీద అపారమైన నమ్మకం, సమయపాలన, ఎదుటవారిని గౌరవించే సంస్కారం ఇలాంటి లక్షణాలతో ఒకమనిషి జీవిస్తే అది చరిత్ర అవుతుంది అనడానికి ఎన్టీఆర్ జీవితం కంటే నిదర్శనం కనపడదు. ఈ లక్షణాలను ఎలివేట్ చేసే సన్నివేశాలను క్రిష్ జ్రాగ్రత్తగా ఒక మాలలా గుచ్చి బాలకృష్ణతో నందమూరి తారకరామారావు మెడలో వేయించాడు.

రామారావు సినీ జీవితం చాలా మందికి తెలుసు అందరికీ తెలిసిన విషయాలను టచ్ చేస్తూ కొంతమందికి తెలిసిన విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టి దర్శకుడిగా నూటికి నూరు మార్కులు సాధించాడు. మనిషిలోని మార్పులకు కొన్ని సంఘటనలు కారణం అవుతాయి అలాంటి సంఘటనలనుండి పుట్టిన సంఘర్షణ మనిషికి కొత్త దారి ని చూపిస్తుంది. అలా రామారావు కొత్త దారులను ఎంచుకునేందుకు ఎదురైన సంఘటలను తెరమీద ఉత్తేజభరితంగా సాగాయి. పది తలల రావణుడ్ని చూపేందుకు 18 గంటలు కదలకుండా నిలబడిన ఓర్పు, దీక్ష, కొడుకు మరణ వార్త విన్నా కూడా తన వల్ల ఎవరూ నష్టపోకూడదని షూటింగ్ లో పాల్గొన్న వ్యక్తిత్వం, అవకాశం మీరు ఇవ్వండి కష్టంతో నా అదృష్టాన్ని నేను వెతుక్కుంటానని అన్నప్పుడు కనబరిచిన నమ్మకం ఇలాంటి సన్నివేశాలతో రామారావు కథను అందంగా హృద్యంగా నడిపాడు దర్శకుడు క్రిష్.

కొడుకు రామకృష్ణ చనిపోయిన సన్నివేశంలో బాలకృష్ణ నటన పతాక స్థాయిలో ఉంది. రామారావు తొలిసారి కృష్ణుడిగా చూపే సన్నివేశం చాలా హైలెట్ గా ఉంది. నిర్మాతల శ్రేయస్సును కోరుకునే తత్వం, ఆత్మాభిమానం కోసం అవకాశాలను కూడా కాదనుకునే మొండితనం, రామారావును తెరమీదే కాదు బయట కూడా హీరోను చేసాయి. అవే ఈ సినిమా సక్సెస్ కు బాటలు వేసాయి. బాలకృష్ణ ను రామారావులో చూసుకోవడం నుండి రామారావే బాలకృష్ణగా కనిపిస్తున్నాడు అనేంతగా బాలకృష్ణ పాత్రలో కనిపించాడు. తనలోని సహాజంగా కనిపించే నటన ఎక్కడా కనపడలేదు.

దివిసీమ ఉప్పెన సన్నివేశం, ఎమర్జెన్సీ టైంలో ఎదుర్కున్నపరిస్థితులు రామారావు ఆలోచనలలో ఎలాంటి మార్పులను తెచ్చాయో తెరమీద చాలా ఎమోషనల్ గా మలిచాడు క్రిష్. రామారావు జీవితం గురించి అంతగా తెలియని ప్రేక్షకులకు ఈ చిత్రంలో ఆయన కుటుంబ జీవితం మనసుకు హత్తుకునేలా చూపించారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు బలం చేకూర్చింది. విద్యాబాలన్ బసవతారం పాత్రకు పూర్తి న్యాయం చేసింది.

కళ్యాణ్ రామ్ పాత్ర లో హారికృష్ణలోని ఆవేశం మొండితనం కనిపించాయి. రకుల్ ప్రీత్ సింగ్, శ్రియ, హన్సిక పాత్రలు కథకు గ్లామర్ టచ్ నిచ్చాయి. అలవాటయిన కెవి రెడ్డి పాత్రను క్రిష్ అలవోకగా నడిపించాడు. ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, కైకాల సత్యన్నారాయణ పాత్రలకు న్యాయం చేసారు. నాదేండ్ల బాస్కరరావు, నారా చంద్రబాబు నాయుడు పాత్రలు ఈ కథలో పరిచయం మాత్రమే అయ్యాయి. రెండో పార్ట్ లో వాటికి ఎక్కువ స్కోప్ ఉండొచ్చు. తెలుగు జాతి మెచ్చుకునే జీవితాన్ని అందరూ మెచ్చుకునే విధంగా తెరకెక్కించాడు క్రిష్.

చివరిగా:
తెరమీద ఎన్టీఆర్ హీరో, తెరవెనుక మోర్ దేన్ ఎ హీరో అలాంటి కథను కనువిందుగా మలిచాడు క్రిష్.