చిన్న చిన్న చిట్కాలతో మలబద్దకాన్ని నివారించుకోవచ్చు ఈజీగా..

మలబద్దకం మనిషి వేధించే అతి పెద్ద సమస్య. చెప్పినంత తేలిక కాదు. అది అనుభవించే వారికే తెలుస్తుంది దాని బాధ. ఆ సమస్యతో బాధ పడుతున్న వారు ఎవరికీ చెప్పుకోలేక, ఏం చెయ్యాలో తెలియక సతమతమవుతుంటారు. ఆకలవుతుంది కానీ తినాలనిపించదు.

అనీజీగా ఉంటుంది. ఎక్కడికీ వెళ్లలేరు. పరిస్థితి తీవ్రమైతే పైల్స్, ఫిషర్ వంటి తీవ్ర అనారోగ్య పరిస్థితులకు కూడా దారితీస్తుంది. అనేక మందికి ఇది ప్రధాన సమస్యగా ఉంటుంది. ఇలాంటి వారికి బాత్రూంకి వెళ్లాలంటేనే భయం వేస్తుంటుంది.

ఈ పరిస్థితికి అనేక కారణాలు ఉన్నా సమస్య మరీ తీవ్రతరం కాకముందే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఈ సమస్యను ఎదుర్కునేవారు తరచుగా కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, ఛాతిలో మంట వంటి అనేక ఇతర సమస్యలతో బాధపడుతుంటారు.

నిజానికి వైద్యుల సలహాను అనుసరించి ప్రతిరోజు ఉదయాన్నే క్రమం తప్పకుండా టాయ్‌లెట్ పూర్తి చేసుకోవడం ఆరోగ్యకరం. ఇలాంటి అలవాటు ఉన్నవారికి ముందు రోజు తీసుకున్న ఘన, ద్రవ ఆహార పదార్థాల కారణంగా ప్రేగులలో పేరుకున్న వ్యర్థాలు మరియు విషతుల్య పదార్థాలు బయటకు వెళ్లి శరీర జీవక్రియ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది.

లేదంటే ఈ విషతుల్య పదార్థాలు రక్త ప్రవాహంలోకి చేరి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఈ చిట్కాలు పాటించి చూడండి. ఒకటి రెండు రోజులు కాకుంగా సమస్య పూర్తిగా తొలగిపోయే వరకు ప్రయత్నించాలి. అవి..

ఇంట్లో వెస్ట్రన్ టాయ్‌లెట్ ఉన్నా దాని మీద ఇండియన్ టాయ్‌లెట్లో కూర్చున్న విధంగా కూర్చోవాలి. అప్పుడే పొట్ట కండరాల మీద ఒత్తిడి కలిగి మోషన్ ఫ్రీ అవుతుంది.
కీళ్ల నొప్పులతో లేదా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాములుగానే ప్రయత్నించాలి.
ప్రతిరోజూ ఉదయం చిన్న చిన్న వ్యాయామాలు చేసినా శరీరంలోని వ్యర్థాలను వెలికి తీయడానికి ప్రేగులను ప్రేరేపిస్తుంది.
ప్రోబయోటిక్స్ అంటే పెరుగు, మజ్జిగ లాంటి పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. వీటిలోని మంచి బ్యాక్టీరియా ప్రేగులలో కదిలికలను సులభతరం చేస్తుంది.
కొబ్బరి నీళ్లను తరచుగా తీసుకుంటే శరీరానికి కావలసిన మెగ్నీషియం సరిపడా మోతాదులో అంది మలబద్దకం, అజీర్ణ సమస్యలు నివారింపబడతాయి. లేదంటే డాక్టర్ సలహాతో మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోవాలి.
ముఖ్యంగా మలబద్దకం సమస్యతో బాధపడేవారు అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లను తీసుకోకపోవడమే మంచిది. చిప్స్, పాస్తా, మొదలైన అనారోగ్యకర పిండి పదార్థాలను తరచుగా తీసుకుంటున్న వారికి జీర్ణ వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే సమస్య నివారణ సులభమవుతుంది.
మరో ముఖ్య విషయం ఎక్కువగా కూర్చొని చేసే ఉద్యోగస్తులు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కునే అవకాశం ఉంది. ప్రతి గంటకు ఒకసారి లేచి ఓ 5 నిమిషాలు అటూ ఇటూ తిరుగుతుండాలి.
ఉదయాన్నే ఓ గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ పిండి తాగుతుండాలి. ఇలా సమస్య తగ్గే వరకు తీసుకుంటూ ఉంటే మలబద్దక సమస్యనుంచి బయటపడతారు. నిమ్మకాయలోని విటమిన్ సి సమస్యని దూరం చేయడంలో సహాయ పడుతుంది.