ఆరేళ్ల చెల్లిని పెళ్లి చేసుకున్న అన్న..ఆరేళ్ల పిల్లకి పెళ్లేంటి.. అదీ అన్నతో.. సమాజం ఎటు పోతోంది.. మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి.. వావి వరుసలు, వయసు తారతమ్యాలు మరిచి ప్రవర్తిస్తున్నారు.. హద్దూ పద్దూ లేకుండా హద్దులు మీరుతున్నారని అనిపిస్తుంటుంది ఇలాంటి వార్తలు చదువుతుంటే.. అయితే ఇక్కడ ట్విస్టేంటంటే ఆ పిల్లల అమ్మానాన్నే స్వయంగా వీరిద్దరికీ పెళ్లి చేశారు.

థాయ్‌ల్యాండ్‌లోని బ్యాంకాక్‌‌కు చెందిన అమర్నసన్ సుత్రోన్ మలిరాట్, పాచారాపర్న్ దంపతులకు 2012లో కవలపిల్లలు పాప,బాబు పుట్టారు. వారికి గిటార్, కివీ అని పేర్లు పెట్టారు. అయితే పుట్టిన వెంటనే వారిద్దరికి పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిశ్చయించుకున్నారు. అదేంటి అన్నా చెల్లెళ్లకు పెళ్లి చేయాలని తల్లి దండ్రులు అనుకోవడం ఏంటని మనకు ఆశ్చర్యం అనిపించవచ్చు.

కానీ వాళ్ల ఆచారం ప్రకారం.. బౌద్ధ ధర్మంలో ఒకే కాన్పులో ఇలా పాప, బాబు పుడితే తప్పనిసరిగా పెళ్లి చేసి ఒక్కటి చేయాలట. ఎందుకంటే వాళ్లు గత జన్మలో ప్రేమికులని, ఈ జన్మలో ఒకరి కోసం ఒకరు జంటగా పుట్టారని విశ్వసిస్తారట. ఇలా పుట్టిన వాళ్లకు వెంటనే పెళ్లి చేయకపోతే భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కుంటారని థాయ్ ప్రజలు నమ్ముతారు.

అందుకే పిల్లలకు ఆరేళ్లు వచ్చే వరకు ఆగి గిటార్, కివీలకు పెళ్లి చేశారు. తండ్రి మాట్లాడుతూ వీరిద్దరూ గత జన్మలో జీవిత భాగస్వాములని నమ్ముతున్నాం. వివాహం చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు రాకుండా, ఎటువంటి అనారోగ్యానికీ గురికాకుండా మంచి జీవితాన్ని గడుపుతారని అన్నారు. పెళ్లిలో భాగంగా చిన్నారులిద్దరితో కొన్ని సాంప్రదాయ ఆటలు ఆడించారు.

వరుడు గిటార్ తొమ్మిది గుమ్మాలు దాటుకుంటూ వధువు కివీని కలవడం ఒక భాగం. అంతే కాదు ఆమెను పెళ్లి చేసుకునేందుకు గిటార్ కన్యాశుల్కంగా కివీకి 2 లక్షల భాట్‌లు (ఇండియన్ కరెన్సీలో రూ.4.37 లక్షలు) కట్నం ఇచ్చి రూ.8 వేల రూపాయల బంగారాన్ని కూడా కివీకి పెట్టాడు. భారీ ఊరేగింపు జరిపి పెళ్లి వేడుకను ముగించారు కుటుంబసభ్యులు.