ఆశ్చర్యం.. పెళ్లి రోజు కేక్ కట్ చేయబోతే..

ప్రేమించిన వరుడు తన జీవిత భాగస్వామి కాబోతున్నాడు. అతిథుల సమక్షంలో ఆనందంగా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేయాలనుకుంది.. బాక్స్ ఓపెన్ చేసి కేక్ తీసి టేబుల్ మీద పెట్టింది. కేక్ కట్ చేసేసరికి దంపతుల ఆనందం కాస్తా ఆవిరి అయ్యింది.

ఫిలిఫిన్స్‌లోని పాసిగ్ నగరానికి చెందిన షిన్ టమాయో,జాన్ చెన్‌లు తమ పెళ్లి వేడుక ఏర్పాట్లు ఘనంగా నిర్వహించమంటూ ఓ వెడ్డింగ్ ప్లానర్‌‌తో మాట్లాడుకున్నారు. అతడికి అడ్వాన్స్ 140,000 పెసాస్ (భారత కరెన్సీ ప్రకారం రూ.1,87,268) చెల్లించారు.

అన్నీ వాళ్లే చూసుకుంటారని పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అందంగా ముస్తాబై వేదిక మీదకు వచ్చారు. అతిధుల సమక్షంలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. అనంతరం విందు ఏర్పాట్లకు సిద్ధమవుతుండగా సమయానికి అందించలేకపోతున్నామంటూ వెడ్డింగ్ ప్లానర్ వాళ్లు చేతులెత్తేశారు.

చేసేదేం లేదని సర్థుకుపోతూ దగ్గరలోని రెస్టారెంట్‌ నుంచి అతిధుల కోసం నూడిల్స్ ఆర్డర్ చేసారు. అంతా అయిపోయాక కేక్ కట్ చేయమంటూ అతిధులు వత్తిడి చేయడంతో టమాయో కేక్ కట్ చేసేందుకు సిద్ధమైంది. ఓ షాక్ నుంచి తేరుకోక ముందే మరో షాక్ తగిలింది.

థర్మాకోల్ షీట్‌కి క్రీం రాసి కేక్‌లాగా తీసుకు వచ్చి పెట్టారని తెలుసుకుని భోరుమంది. తన పెళ్లి రోజును చేదు జ్ఞాపకంగా మిగిల్చిన వెడ్డింగ్ ప్లానర్ మీద కోపం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు దంపతులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెడ్డింగ్ ప్లానర్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.