అతడికి 64 ఆమెకి 34.. 12 ఏళ్లుగా సహజీవనం.. మూత్రంతోనే స్నానం

పొద్దున్న లేస్తే ఉరుకుల పరుగుల జీవితం. లక్షల్లో జీతం వస్తున్నా జీవితం నిస్సారంగా అనిపిస్తుంది. ఏదో తెలియని వేదన అంతరంగాన్ని వేధిస్తుంటుంది. ఎవరికోసం కష్టపడాలి. ఎంత సంపాదిస్తే తృప్తి కలుగుతుంది. జవాబు లేని ఎన్నో ప్రశ్నలు మదిని తొలుస్తుంటాయి. నిరంతర ఆలోచనలు మనిషిని కలచివేస్తుంటాయి. సమాధానం లేని ప్రశ్నలతో సంచార జీవులుగా మారారు పీటర్, మిరియమ్‌లు..

ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్నా నెలకు లక్షల రూపాయల జీతం వస్తున్నా ఆనందంగా లేరు.
న్యూజిలాండ్‌కు చెందిన పీటర్‌కు 64 ఏళ్లు, మిరియమ్‌కు 34 ఏళ్లు. ఇద్దరికీ 30 ఏళ్ల వయసు తేడా ఉన్న ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. ఇద్దరివీ ఒకే ఆలోచనలు. ఉన్నతోద్యోగాలు చేస్తున్న వారిద్దరూ ఉన్న ఊరిని చేస్తున్న ఉద్యోగాలని వదిలి 12 ఏళ్ల క్రితం కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు.

కలిసి సహజీవనం చేస్తూ ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. పంచభూతాల సాక్షిగా పర్మినెంట్ అడ్రస్ ఏదీ లేకపోయినా పచ్చని చెట్ల మధ్య ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పది కాలాలు బతికేద్దామనుకున్నారు.
30 సంవత్సరాల క్రితం ఎకాలజీలో పీహెచ్‌డీ చేసిన పీటర్ లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తుండేవాడు.

గంటకు 50 డాలర్ల జీతంతో ఆయన బోధన సాగుతుండేది. నాలుగు గోడల మధ్య నలుగురికీ పాఠాలు బోధించే ఉద్యోగం ఆయనకు నచ్చలేదు. ఇది కాదు జీవితం అంటే అని అనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవు.. ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేసాడు. ప్యాకప్ అంటూ బ్యాగులో బట్టలు సర్దేసి కూడబెట్టిన సొమ్ముని బ్యాంకులో వేసి, ఉన్న ఇంటిని తెలిసిన వారికి అప్పగించేశాడు. సంచారకుడిగా జీవితాన్ని ప్రారంభించాడు.

ఇదే సమయంలో నెదర్లాండ్స్‌కు చెందిన క్రీడాకారిణి మిరియమ్‌కి ట్రావెలింగ్ చేస్తూ జీవనం సాగించాలనే కోరిక కలిగింది. ఇష్టంగా ఎంచుకున్న క్రీడారంగాన్ని సైతం వదిలేసి సంచార జీవితం చేపట్టింది. అందులో భాగంగానే ఇండియా చేరుకుంది. 70 ఎమ్ ఎమ్ స్క్రీన్‌ని తలపించే సినిమాలాగా అదే సమయంలో ఇండియాకు చేరుకున్న పీటర్‌ని కలుసుకుంది మిరియమ్. ఇద్దరి ఆలోచనలు ఒకటే కావడంతో కలిసి సహజీవనం చేస్తూ ప్రపంచాన్ని చుట్టేయాలనుకున్నారు.

దాచుకున్న సొమ్ములోనించి సంవత్సరానికి 3వేల పౌండ్లు మాత్రమే ఖర్చు పెడుతూ కొండలూ, కోనలూ దాటేస్తూ మనుషులకు దూరంగా, ప్రకృతికి దగ్గరగా జీవిస్తున్నారు. ప్రస్తుతం బల్గేరియాలోని పర్వత ప్రాంతంలో సంచరిస్తున్న ఈ జంట ఓ టీవీ ఛానల్ కెమేరా కంటికి చిక్కారు. వారి ఇంటర్వ్యూతో ఈ వివరాలన్నీ బయటకు వచ్చాయి.

వెజిటేరియన్‌గా ఉన్న మిరియమ్ అడవుల్లో సంచరిస్తూ అక్కడ దొరికే ఆహారాన్నే తింటూ బతికేస్తోంది. ఏదైనా జంతువుని వేటాడి మిరియమ్ తీసుకువస్తే దాన్ని కాల్చి తినడానికి అనువుగా మార్చే బాధ్యత మాత్రం పీటర్‌ది. ఇలా జంతువులను వేటాడం నేర్చుకోవడానికి రెండేళ్ల సమయం పట్టిందని మిరియమ్ చెప్పుకొచ్చింది. మొదట్లో వాటిని చంపడం బాధ కలిగించినా.. జీవిక కోసం తప్పలేదంటోంది.

ట్రావెలింగ్ సమయంలో తమకు కావలసిన వస్తువులు కొనుక్కుంటారు. అయితే సబ్బులు, షాంపూల వంటివి ఆ లిస్ట్‌లో ఉండవు. అడవిలో దొరికే ఆకులు, అలములతోనే ఒంటిని శుభ్రపరుచుకుంటారు. ఇంటర్వ్యూ చేసే వారిని ఆశ్చర్యపరుస్తూ మిరియమ్ ఓ విషయం చెప్పింది. తాను తన జుట్టుని తన మూత్రంతోనే క్లీన్ చేసుకుంటానని తెలిపింది.

ఈ జీవితం తనకెంతో తృప్తినిస్తోందని మిరియమ్ అంటోంది. అయితే ఇంత వయసు తారతమ్యంతో మీరిద్దరూ ఎలా కలిసి ఉంటున్నారని ప్రశ్నిస్తే.. వయసుతో పనేముంది.. అయినా ఇలానే ఉండాలని ఎవరైనా హద్దులు విధించారా అని తిరిగి ప్రశ్నిస్తోంది మిరియమ్. తామిద్దరం ఒకరికి ఒకరు సొంతమేమీ కాదని, భవిష్యత్తులో ఒంటరిగా జీవిచాలనుకుంటే కూడా ఉంటామని చెప్పింది.

పీటర్ మాత్రం జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరని.. మేం కూడా తరువాత సాధారణ జీవితం గడపడానికి మొగ్గుచూపుతామేమో అని బదులిచ్చాడు. ఇప్పుడైతే తామిద్దరం చాలా సంతోషంగా ఉన్నామని, సంచార జీవితంలో ఉన్న మజాని ఎంజాయ్ చేస్తున్నామంటున్నాడు.