అంబులెన్స్‌ని ఢీకొట్టిన కారు.. ‌భార్యాభర్తలు మృతి

road accident

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు రక్తమోడుతోంది. మితిమీరిన వేగంతో ప్రాణాలు పోతున్నాయి. గత వారంలో రోజుల్లో పది మంది ఓఆర్ఆర్ మీద ప్రాణాలు కొల్పోయారు. తెల్లవారుజామునే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు..ప్రమాదాలకు కేరాఫ్ గా మారుతోంది. రింగ్ రోడ్డు ఎక్కితే..దిగే వరకు టెన్షన్ తోనే ప్రయాణం చేయాల్సిన అగత్యం నెలకొంది. సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ శివారు ప్రాంతాల్లోని ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ప్రమాదాల సంఖ్య పెరిగిపోయింది.

ఔటర్ పై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదిబట్ల సమీపంలోని రావిరాల దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్ నుంచి బొంగులూర్ వైపు వెళుతున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న అంబులెన్స్ ను ఢీకొట్టింది. అంబులెన్స్ డ్రైవర్ తోపాటు ఇందులో ఉన్న భార్యభర్తలు మృతి చెందారు. కారుడ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.

రంగారెడ్డిజిల్లా యాచారం మండలం తక్కలపల్లి దగ్గర కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న అనిల్ కుమార్ చౌదరి మ్రుతిచెందగా.. అతని భార్య, కుమారుడితోపాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మియాపూర్ ప్రాంతానికి చెందిన వీరు సంక్రాంతి పండుగకు ఊరికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక గచ్చిబౌలి నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డు మీద జరిగిన మరో ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఒకదాని వెనక మరోటి మూడు కార్లు ఢి కొన్నాయి.
.

మూడు రోజుల క్రితం వట్టినాగులపల్లి సమీపంలో క్రషర్ మిషన్ లారీ, మినీ ఆటోను ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు కీసర ఓఆర్ఆర్ పై డీసీఎం వ్యాను బైక్ ను ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్నవ్యక్తి మృతి చెందాడు. మరొక వ్యక్తి గాయపడ్డాడు. అటు హయత్ నగర్ పెద్ద అంబర్ పేటలో పాలవ్యాన్ ను లారీ ఢీకొనడంతో వ్యాను డ్రైవర్ మరణించాడు. ఇదే ప్రాంతంలో కారు టైర్ పేలడంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన నిల్చున్న విద్యార్ధులపై దూసుకొళ్లింది. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు మరణించారు. అబ్దుల్లాపూర్ సమీపంలో ఓ లారీ బైక్ ను ఢీకొన్న ఘటనలో స్కూటర్ పై వెళుతున్న భార్యభర్తులు తీవ్రంగా గాయపడ్డారు.

ఔటర్ పై జరుగుతున్న ప్రమాదాలు ఎక్కువగా తెల్లవారుజామునే చోటు చేసుకుంటున్నాయి. చలి, పొంగమంచుకుతోడు నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడంతో యాక్సిడెంట్లు పెరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. బాధితులు మాత్రం అత్యాధునిక హంగులతో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డుపై పెట్రోలింగ్ వ్యవస్థ వైఫల్యం కూడా ప్రమాదాలకు కారణమని ఆరోపిస్తున్నారు.

Recommended For You