రాష్ట్రానికి లక్షా 26 వేల ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు..

cm chandrababunaidu teleconference on janmabhoomi

జన్మభూమి 9వ రోజుపై టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి లక్షా 26 వేల ఉద్యోగాలను కల్పించే పరిశ్రమలు రానున్నాయని తెలిపారు… విశాఖ నగరానికి డేటా సెంటర్ హబ్, డేటా సెంటర్ పార్కులు, సోలార్ పార్కులు రానున్నాయన్నారు. లాజిస్టిక్స్ హబ్ గా ఏపీ రూపాంతరం చెందనుందన్నారు చంద్రబాబు… భావనపాడు పోర్ట్, రామాయపట్నం పోర్టులు రానున్నాయని చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటు జరుగుతోందని తెలిపారు. ప్రకాశం జిల్లాకు రూ. 24,500 కోట్ల పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. ఆసియా పల్ప్ అండ్ పేపర్ మిల్స్ ద్వారా ప్రత్యక్షంగా 4,500 మందికి, పరోక్షంగా 12 వేల మందికి ఉపాధి దొరకబోతోందని తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా 50 వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఇళ్ల కోసం భారీ ఎత్తున అర్జీలు వచ్చాయని… త్వరితగతిన వీటన్నింటినీ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వెనుకబడిన జిల్లాల్లో సంపద సృష్టిస్తున్నామని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు.

Also read : సీఎం చంద్రబాబు ఇవాళ్టి షెడ్యూల్ ఇదే

ఇంటింటికీ తాగునీటి కనెక్షన్‌ ఇస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు. 22 వేల కోట్ల రూపాయలతో జలధార కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అమరావతి నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో ఏడాదికి రూ. 6 వేల కోట్లు వెళ్తోందని వివరించారు. కానీ ఏపీకి ఇవ్వడానికి మాత్రం కేంద్రానికి చేతులు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల కోసం 500 ఎకరాలు కేటాయించామని స్పష్టం చేశారు. షేర్‌వార్న్‌ టెక్నాలజీతో 4 వేల ఇళ్లు నిర్మించామన్నారు. వచ్చే 10 ఏళ్లలో జీఎస్‌డీపీ 7శాతం పెరగాలన్నారు. ప్రతి ఏటా 12శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రజలతో నేరుగా మాట్లాడారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పలు కార్యక్రమాలపై ఆయన ఆరా తీశారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన జన్మభూమి – మా ఊరు కార్యక్రమంపై ప్రజా స్పందనను తెలుసుకున్నారు… దీనిలో భాగంగా విశాఖ జిల్లాలోని యలమంచిలి ప్రజలతో సీఎం నేరుగా మాట్లాడారు. జన్మభూమి కార్యక్రమంపై ఆరా తీయడమే కాకుండా.. అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారంపై అధికారులు, ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు కొన్నిసూచనలు చేశారు.