ఆమె కోసం అతడు.. అతడి కోసం ఆమె.. చివరకు

ప్రేమ.. తొలి చూపులోనే కలిగే ఓ తీయని భావన. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఊరికే అన్లేదు. చూడగానే నచ్చేశాడు. అతడే నా జీవిత భాగస్వామి అయితే బావుండు అని మనసులో అనుకుంది.. అతడు కూడా అలాగే అనుకున్నాడు. ఆరు నూరైనా ఆమే నా అర్థాంగి అనుకున్నాడు.

కానీ ఎలా చెప్పేది. కట్టుబాట్లు.. తమ మనసులోని ప్రేమని పెద్దలకు చెప్పే ధైర్యంలేదు. మనసు మూగగా రోదించింది. మనువు తనతో కాకుండా మరొకరితో అంటే అస్సులు ఊరుకోలేనంది. తనువు చాలించడమే మార్గమనుకుంది. వికారాబాద్ జిల్లా అత్తెపల్లికి చెందిన రేష్మాబేగంకి నవాజ్ వరుసకు బావే అవుతాడు.

రేష్మా అక్కని నవాజ్ అన్నకు చేసుకోవడంతో వారిరువురి కుటుంబాల మధ్య రాకపోకలు సాగేవి. అక్క పెళ్లప్పుడే బావ తమ్ముడితో చూపులు కలిపింది. క్రమంగా వారిద్దరి మధ్య ప్రేమ పెరిగింది. పెళ్లి చేసుకోవాలని అనుకున్నా పెద్దలకు చెప్పాలంటే ధైర్యం చాల్లేదు రేష్మకి. ఈ క్రమంలోని ఇంట్లో వాళ్లు తనకు సంబంధాలు చూస్తున్నారు.

వరుడ్ని వెతికే పనిలో ఉండగా ఆ పెళ్లి ఇష్టం లేని రేష్మ పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెని హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. వెంటనే వైద్యం చేసిన డాక్టర్లు ఆమెను ప్రాణాపాయం నుంచి తప్పించారు.

ఇంతలో అక్కడికి చేరుకున్న నవాజ్ తనకోసమే రేష్మా ఆపని చేసిందని తెలుసుకుని తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రేష్మ తాగిన విషం సీసా ఏదని కుటుంబ సభ్యులను అడిగి తీసుకుని అందరూ చూస్తుండగానే అందులో మిగిలిన విషం తాగేశాడు.

ఈ పరిణామానికి హతాశులైన బంధువులు వెంటనే డాక్టర్లకు సమాచారం అందించారు. వైద్యుల పర్యవేక్షణలో నవాజ్, రేష్మలు మరణం చివరి అంచుల వరకు వెళ్లి కోలుకున్నారు. వారి ప్రేమను అంగీకరించిన పెద్దలు ఆసుపత్రి ఆవరణలోనే వారి వివాహాన్ని జరిపించారు.