కాంగ్రెస్‌‌కు బిగ్ షాక్..

బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి కట్టి మోడీని ఓడించాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌ ఆశలు నీరుగారిపోతున్నాయి. తమతో కలిసివస్తాయని భావించిన ప్రాంతీయపార్టీలు ఒక్కక్కటిగా దూరమవుతున్నాయి. కలుస్తాయనుకున్న ప్రాంతీయశక్తులు హస్తంపార్టీకి దూరం పాటిస్తున్నాయి. అటు బీజేపీ కొత్తమిత్రుల వేటలో ఉంది. ఎవరితో అయినా పొత్తులకు సిద్దమంటోంది. దీంతో జాతీయరాజకీయాల్లో నిన్నటివరకూ పరిస్థితులు ఇప్పుడు తిరుగుబడుతున్నట్టు కనిపిస్తోంది.

యూపీలో తమతో కలిసివస్తాయని భావించిన ప్రధానపార్టీలు ఎస్పీ, బిఎస్పీ కాంగ్రెస్‌ పార్టీకి హ్యాండిచ్చాయి. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్‌ తో సీట్లు షేర్‌ చేసుకోవడానికి ఇరుపార్టీలు సిద్దంగా లేవు. మొత్తం 80 సీట్లలో చెరో 40 సీట్లులో పోటీచేయాలని నిర్ణయించాయి. శనివారం మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌ కలిసి మీడియా ముందుకు రానున్నారు. ఉప ఎన్నికల్లో ఇరుపార్టీలు కలిసిపోటీచేసి విజయం సాధించాయి.. ఇదే ఫార్ములా కొనసాగించాలని నిర్ణయించారు. అటు బీహార్‌ లో సీట్లు పంపిణీ వ్యవహారంలోనూ ఆర్జేడీ- కాంగ్రెస్ మధ్య చిచ్చు రాజుకుంది. ఆర్జేడీ 10 సీట్లు మాత్రమే కాంగ్రెస్‌ కు ఇస్తామని ఆఫర్‌ చేసింది. అయితే 40 సీట్లలో 20 చోట్ల తాము గెలుస్తామని.. ఆర్జేడీ ఆఫర్‌ ను తిరస్కరించింది. దీంతో ఇరుపార్టీలు మధ్య పొత్తులు దాదాపు లేనట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే టీడీపీ మినహా కొత్తపార్టీలు ఎవరూ కాంగ్రెస్‌ తో జతకట్టేందుకు ముందుకురావడం లేదు. ఓడిషాలో నవీన్‌ పట్నాయక్‌ ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు సమదూరం పాటిస్తామని ప్రకటించారు. అటు మమత బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమాద్మీ పార్టీ కూడా ఎన్నికల తర్వాత పరిస్థితులకు అనుగుణంగానే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌ నేతృత్వంలో మహాకూటమి ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఆచరణలోకి వస్తుందా అన్నదే సందేహం. ఓ అడుగు వెనక్కి తగ్గి సీట్లు విషయంలో రాజీపడతానని గతంలో చెప్పిన కాంగ్రెస్‌ ఇప్పుడు దూకుడుగా వెళుతుంది. మూడు రాష్ట్రాల్లో విజయంతో సీట్లు విషయంలో రాజీపడకూడదని భావిస్తోందా?