బరువు తగ్గాలంటే బంగాళదుంప..

ఆలూ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టం. ఇక పెళ్లిళ్లు, పేరంటాల్లో అయితే ఆలూ లేని భోజనం ఉండదు. దుంప కూర అని పెద్దలు తినడానికి భయపడుతుంటారు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని లావుగా ఉన్నవారు కూడా తినాలని ఉన్నా తినలేరు.

అయితే ఆ భయాలేవీ పెట్టుకోకుండా నిరభ్యంతరంగా,హ్యాపీగా తినేసి బరువు తగ్గించుకోమంటున్నారు పోషకాహార నిపుణులు. ఆలూ తింటే బరువు తగ్గడంతో పాటు రోజంతా చురుగ్గా ఉంటారని అంటున్నారు. బంగాళదుంపతో బరువు తగ్గడం ఏంటని ఆశ్చర్యపోకండి.. అదెలాగో చూడండి..

తిండి మానేసి, ఆఖరికి ఇష్టమైనవి కూడా తినడం మానేసి బరువు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. సహజంగా బరువు తగ్గించుకోవాలనుకునేవారు ఈ మూడు ప్రణాళికలు అనుసరించి చూడండి. బంగాళదుంపలు కొవ్వు పెరుగుదలకు కారణం కాదు.

అధిక బరువు కలిగిన వ్యక్తులలో జీవ క్రియల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందుచేత అధిక బరువు ఉన్నవారు బంగాళ దుంపలను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. ఇందులో ఉండే కొవ్వు ఆరోగ్యకరమైనది. ఇంకా విటమిన్ సి, విటమిన్ బి6 మరియు పొటాషియం నిల్వలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియలు సక్రమంగా పనిచేయడానికి సహకరిస్తాయి.

ప్రణాళిక 1: 6 బంగాళ దుంపలను తీసుకుని ఒక్కోదాన్ని 2 ముక్కలుగా కోసి గోధుమ రంగులోకి వచ్చే వరకు ఒవెన్లో బేక్ చేయాలి. ఇందులో ఉప్పు, కారం, మసాలాలు వంటివి ఏవీ జోడించకుండా వేడిగా 7 రోజుల పాటు వరుసగా తీసుకోవాలి. దీనితో పాటు మధ్యలో మంచి నీరు ఎక్కువగా తీసుకోవడం మరచి పోవద్దు.

ప్రణాళిక 2: 4 నుంచి 6 దుంపలకు కొద్దిగా ఆలివ్ నూనె, చిటికెడు ఉప్పు కలిపి ఒవెన్లో కాల్చి తీసుకోవాలి. దీన్ని కూడా ఓ వారం రోజుల పాటు పాటించాలి.

ప్రణాళిక 3: మూడు ఉడికించిన బంగాళ దుంపలను తీసుకుని వాటిని ఒక స్పూన్‌తో బాగా చిదమాలి. దీనికి అల్లం, వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా జోడించి ఒవెన్లో బేక్ చేసి తీసుకోవాలి. శరీరంలో పేరుకున్న అధిక కొవ్వును తొలగించడంలో అల్లం వెల్లుల్లి కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి.

ఇక ఆలూలో ఉండే కార్బోహైడ్రేట్లు తరచుగా ఆకలి బారిన పడకుండా చూస్తాయి. ఇందులో ఉన్న పిండిపదార్థాలు కడుపు నిండిన భావనని కలిగిస్తాయి. క్రమంగా చిరు తిళ్లు తినాలనే ఆలోచన, ఎక్కువ తినాలనే కోరికను తగ్గిస్తుంది. దాంతో బరువు కూడా తగ్గిపోతారు. అన్ని కూరగాయల్లోకి బంగాళదుంపలను అత్యంత శక్తివంతమైన ఆహారంగా చెప్పవచ్చు.

బంగాళ దుంపల్లో కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉండడంతో బరువు తగ్గాలనుకునే వారికి మంచి ప్రత్యామ్నాయ ఆహారం. బంగాళ దుంపల్లో ఉండే ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఆరోగ్యవంతమైనవి. కాబట్టి భయం లేకుండా తీసుకోవచ్చు. ఇంకా ఈ దుంపలో నీటి నిల్వలు కూడా అధికంగా ఉండడంతో ఆహారంగా తీసుకోవడం వలన డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది.

చివరిగా.. బంగాళ దుపలు మాత్రమే బరువుతగ్గిస్తాయని అనుకోవద్దు. ఆరోగ్యవంతమైన జీవనశైలి, వ్యాయామం, వ్యసనాలకు దూరంగా ఉండడం, వేళకు నిద్ర కూడా బరువు తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.