రెడీ.. 1..2..3.. రైలెళ్లిపోతోంది.. అయినా ఇకపై ఖాళీ బెర్తుల వివరాలు తెలుసుకోవచ్చు

ఇంతకు ముందు రైలు బయలు దేరడానికి రెండు గంటల ముందు రిజర్వేషన్ చార్ట్ ఖరారయ్యేది. రైలు కదిలే సమయానికి కన్ఫామ్ అయిన రిజర్వేషన్ బెర్తుల పట్టిక అందుబాటులో ఉండేది. కానీ, ఇకపై రైలు బయలు దేరిన తరువాత కూడా ఖాళీ బెర్తుల వివరాలు తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది రైల్వేశాఖ.

ఈ విధానాన్ని తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అమలు చేస్తున్నారు. రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకు వచ్చి హ్యాండ్ హెల్డ్ టర్మినల్స్ (హెచ్‌హెచ్‌టి) వ్యవస్థ ద్వారా రైలు బయలుదేరిన తరువాత బెర్తుల వివరాలు తెలుసుకోవడం సాధ్యమవుతుంది.

డివిజనల్ రైల్వే మేనేజర్ అమిత్ వరదాన్ గురువారం ఈ వ్యవస్థను ప్రారంభించారు. ఇక నుంచి టీసీలు ఈ హెచ్‌హెచ్‌టి పరికరాల ద్వారానే టికెట్ల తనిఖీని నిర్వహించనున్నారు. వివిధ స్టేషన్ల మధ్య ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలను దీని ద్వారా తెలుసుకుని నిరీక్షణ జాబితాలో ముందు వరుసలో ఉన్నవారికి టికెట్లు కేటాయించే అవకాశం ఉంటుంది.

ఈ పరికరం వలన మోసాలను కూడా అరికట్టవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. దీని వలన ఖాళీ బెర్తుల వివరాలు ఎప్పటికప్పుడు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. వీటితో పాటు భోజనం, బెడ్ రోల్స్ వివరాలు కూడా ప్రయాణీకులు తెలుసుకునే వీలుంటుంది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి బయలుదేరే నాలుగు ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని సిబ్బందికి 40 హెచ్‌హెచ్‌టి పరికరాలను అందజేశారు.