మహబూబ్ నగర్ నుంచి ఎవరు పోటీ చేస్తారంటే..

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శాసనసభ ఎన్నికల్లో అనూహ్య పరాజయం తర్వాత ఇపుడిప్పుడే కోలుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు.. పాత తప్పిదాలు పునరావృతం కారాదన్న స్పృహతో భవిష్యత్తు రాజకీయాల దిశగా మరింత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలకు ఇప్పటినుంచే విందు సమావేశాల పేరిట తెరవెనుక మంతనాలు సాగిస్తున్నారు. మరో అయిదేళ్లపాటు శాసనసభ ఎన్నికల ఊసు ఉండదు కాబట్టి, సహజంగానే పార్లమెంటు ఎన్నికలవైపు అందరి దృష్టి మళ్లుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల్లో నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వుడు స్థానం. దీంతో అందరి చూపు మహబూబ్ నగర్ లోకసభ స్థానంపైనే పడింది. రాష్ట్ర స్థాయిలో ప్రముఖ నేతలుగా ఉన్న డీకే అరుణ, చిన్నారెడ్డి, రేవంత్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్‍ వారికి ఓటమి తప్పలేదు. ఇప్పుడు వీరిలో కొందరి చూపు మహబూబ్ నగర్ ఎంపీ స్థానంపై పడింది. కొంతమంది బయటకు వెల్లడించకపోయినప్పటికీ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీపై ఆసక్తితో ఉన్నారు. సీనియర్ నేత జైపాల్‍ రెడ్డి సైతం మళ్లీ మహబూబ్ నగర్ నుంచే పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే.

Also read : టీడీపీ, వైసీపీ నేతలు సవాళ్లు.. వైసీపీ నేతలను బయటకు పంపించి..

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి డీకే అరుణతో పాటు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‍ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో సీనియర్ నేతజైపాల్‍ రెడ్డికి జిల్లాలో చెక్ పెట్టవచ్చని వ్యూహాత్మకంగా ఓ వర్గం పావులు కదుపుతుందని ప్రచారం సాగుతున్నది. ఇలా మహబూబ్ నగర్ లోకసభ స్థానం నుంచి పోటీ చేసేందుకు నాయకులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తు ముందుకు సాగుతున్నారు. ఇటీవల విందు భేటీలో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడానికి డీకే అరుణ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. హైదరాబాద్ గండిపేటలో జరిగిన సమావేశం ద్వారా పీసీసీ రేసులో కూడా తాను ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. గండిపేటలో జరిగిన సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యం లేదని, ఎన్నికల తర్వాత అందరం కలిసి మాట్లాడుకోవాలన్న ఉద్దేశంతోనే గత శాసనసభలో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులందరినీ ఆహ్వానించానని డీకే అరుణ తన అనుచరవర్గంతో అన్నట్టు తెలిసింది. కానీ ఆమె ఎంపీ సీటు వదులుకుంటే కీలక పదవి తనకు వచ్చేలా చేయాలని అంటున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పాలమూరు రాజకీయం రసవత్తరంగా మారింది.