రాజేశ్వరి రాజీ లేని పోరాటం.. గ్రామం మొత్తం కలిసి..

నలుగురికీ ఉపయోగపడే మంచి పని చేయాలనుకుంది. మహిళను.. నామాట ఎవరు వింటారు అని నిరూత్సాహ పడలేదు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే దాకా రాజీలేని పోరాటం చేసింది యాదాద్రి జిల్లా చౌటుప్పల్ గ్రామానికి చెందిన సర్పంచ్ రాజేశ్వరి. దాని ఫలితమే పదేళ్ల నుంచి అక్కడ మద్య నిషేధం అమలవుతోంది.

పత్తి సాగు ప్రధాన ఆధారంగా బతుకుతున్నారు అక్కడి గ్రామ ప్రజలు. గ్రామంలో 300 లు లారీలు కూడా ఉండడంతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేవి. కొద్దో గొప్పో ఆదాయాన్ని సమకూర్చుకుంటూ వాటిని తమ అత్యవసర అవసరాలకు ఉపయోగించుకోకుండా తాగుడికి అలవాటు పడ్డారు. మద్యానికి బానిసయ్యారు. తాగిన మైకంలో గ్రామంలో నిత్యం గొడవలు జరుగుతుండేవి.

ఇది ఇలానే కంటిన్యూ అయితే గ్రామంలోని యువతకు భవిష్యత్ ఉండదని భావించిన అప్పటి గ్రామ సర్పంచ్ మునగాల రాజేశ్వరి ఓ నిర్ణయం తీసుకుంది. గ్రామం నుంచి మద్యం దుకాణాలు తరిమివేస్తే తప్ప మార్గం లేదనుకుంది. అందుకోసం గ్రామంలోని మహిళందరినీ సమీకరించి సమావేశం ఏర్పాటు చేసింది.

ఆమె ప్రయత్నానికి మద్దతు తెలిపారు గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు, అఖిలపక్ష నాయకులు. వారంతా ఏకమై బెల్టు షాపులన్నీ మూత పడేలా చేశారు. తిరిగి ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అప్పటి రాజేశ్వరి పోరాటం ఫలించి పదేళ్లుగా అక్కడ మద్యం దుకాణాలు లేవు. మహిళా సర్పంచ్ ఆజ్ఞ నేటికీ అమలవుతోంది.

మద్యంలేని ఆ గ్రామలోని ప్రజలు ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ప్రభుత్వ దృష్టికి తమ గ్రామ రాకపోవడం విచారకరమని గ్రామ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందలేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు.

Recommended For You