2019 ఎలక్షన్ బ్యాండ్ మోగించిన బీజేపీ

అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు.., జీఎస్టీ సడలింపులు.., దిగొస్తున్న పెట్రోల్ ధరలు… ఇలా సానుకూల నిర్ణయాలతో సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం అవుతోంది బీజేపీ. కోటా బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందిన వెంటనే 2019 ఎలక్షన్ బ్యాండ్ మోగించింది. ఢిల్లీలో సమావేశమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రసంగించిన పార్టీ చీఫ్ అమిత్ షా.. లోక్ సభ ఎన్నికలకు అవలంభించాల్సిన విధానాలపై పలు సూచనలు చేశారు. రామమందిరం దగ్గర్నుంచి మహాకూటమి, రాఫెల్ స్కాం లాంటి అవినీతి ఆరోపణల వరకు విపక్షాలపై విమర్శలు కురిపించారు.

Also read : మంత్రి పదవులు వీరికేనా..?

సౌత్ టూ నార్త్ సత్తా చూపిస్తామంటున్న బీజేపీ మళ్లీ రామమందిరం వాయిస్ తో జనంలోకి వచ్చింది. రామ్ మందిరాన్ని వీలైనంత త్వరగా నిర్మించేందుకు తాము సిద్ధమని రామ్ లీలా మైదాన్ వేదికగా అమిత్ షా ప్రకటించారు. కాంగ్రెస్ అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు.

మహాకూటమిపై అమిత్ షా ఫైరయ్యారు. ప్రజల కోసం తాము చేయాల్సినదంతా చేశామన్నారు. మోడీ భయంతోనే ప్రతిపక్షాలన్ని ఒక్కటయ్యాయని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికలు మోడీ వర్సెస్ విపక్షాలు అని అన్నారాయన. కూటమి పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు అమిత్ షా. ఉత్తర ప్రదేశ్ లో పొత్తుపై అఖిలేష్, మాయావతి ఇవాళ క్లారిటీ ఇవ్వనున్నారు. అయితే వాళ్లిద్దరి పొత్తుతో ఒరిగేమి లేదన్నారు అమిత్‌షా. రెండు విభిన్న ఐడియాలజీ పార్టీల మధ్య ఎన్నికలు జరగాలి కానీ, మహాకూటమికి లీడర్ లేడు.. సిద్ధాంతం లేదని అమిత్ షా ఫైర్ అయ్యారు.

దాదాపు 12 వేల మంది జాతీయ కార్యవర్గ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశాన్నే సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధంగా భావిస్తోంది బీజేపీ అధిష్టానం. కేంద్ర ప్రభుత్వ ఆశయాలను ప్రతీ కార్యకర్త జనాల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చిన షా.. పార్టీ సభ్యత్వం, సంక్షేమ పథకాలే బలమని వివరించారు. రెండ్రోజులు జరిగే సమావేశాల్లో తొలి రోజు షా ప్రసంగించగా ముగింపు సభలో మోడీ మాట్లాడతారు.