అప్పటినుంచే గోదావరి జిల్లాల్లో కత్తులు నూరడం ప్రారంభమవుతుంది

cock fight in godhavari districs

గోదావరి జిల్లాల్లో కోడిపందాలకుండే క్రేజే వేరు… సంక్రాంతి వచ్చిందంటే కోళ్ల సందడి ఉండాల్సిందేనంటారు ఇక్కడి జనం… ధ‌నుర్మాసం మొదలైప్పటి నుంచి గోదావరి జిల్లాల్లో కత్తులు నూరడం ప్రారంభమవుతుంది. కోడి పందాల వ్యవహారంలో ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు సైతం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు. పుంజుల మధ్య వైరాన్ని రగిల్చి, కత్తులతో తలపడే ఈ ఆట ఇక్కడ సంప్రదాయంగా మారింది… కోడి పందాలకు అనుబంధంగా మద్యం విక్రయాలే దాదాపు 500 కోట్ల రూపాయలుంటుందని ఎక్సైజ్ శాఖ అంచనా. గ్రామాల్లో నాటు సారా విక్రయాలు కూడా కోట్లలోనే జరుగుతుంటాయి…

Also read : మహిళకు రుతుక్రమం అని గుడిసెలో ఉంచారు..తెల్లారి లేచి చూస్తే..

గోదావరి జిల్లాల్లోని గ్రామాల్లో చిన్న చిన్న పందాలే 25 నుంచి 50 కోట్ల రూపాయలలోపు జరుగుతాయి. పేరు మోసిన కేంద్రాల్లో మాత్రం కనీసం 100 కోట్ల రూపాయలకు తగ్గకుండా పందాల పేరిట డబ్బు చేతులు మారుతుంది… ఏటా సంక్రాంతి మూడు రోజులు గోదావరి జిల్లాలు కోడి పందాలకు, ఇతర జూదాలకు అడ్డాలుగా మారుతాయి. సినిమా పెద్దల కోసం షూటింగ్ ప్రాంతాల్లో సేదతీరడానికి ఏర్పాటుచేసే ‘కార్‌వాన్’ విధానం ఈసారి పందాల వద్ద ఏర్పాటుచేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పందాలకు ఊపునిచ్చేందుకు బడా బాబుల కోసం ఏసీ డెన్‌లు ఏర్పాటుచేస్తున్నారు…

పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి, కాళ్ళకూరు, జువ్వలపాలెం, భీమవరం ప్రకృతి ఆశ్రమం, అయి భీమవరం, మహాదేవపట్నం, అన్నవరం, కోరుకొల్లు, కొవ్వాడ, భీమవరం, యలమంచిలి, మొగల్తూరుతో పాటు జంగారెడ్డిగూడెం, శ్రీనివాసపురంలో జోరుగా పందాలు జరుగుతున్నట్టు సోష‌ల్ మీడియాలో ప్రచారం జ‌రుగుతోంది. ఇక తూర్పు గోదావరి జిల్లాలోని అయి పోలవరం, మురమళ్ళ, ముమ్మిడివరం, కాట్రేనికోన, సఖినేటిపల్లి, మామిడికుదురు, మల్కిపురం, రాజోలు, రావులపాలెం, ఆత్రేయపురం తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున పందాలకు రంగం సిద్ధమైంది. డబ్బు సంచులతో బడాబాబులు, అనుబంధ జూదాల మాఫియా బ్యాచ్‌లు, వడ్డీ వ్యాపారులు గోదావరి జిల్లాల్లో ముందుగానే సమీపంలో మకాం చేస్తున్నారు. లాడ్జీలు, కాన్ఫరెన్స్ హాలులు నిండిపోయాయి. ఈసారి వెరైటీగా ఆన్‌లైన్‌లో పందాలు నిర్వహించడానికి ఏర్పాట్లుచేశారు.

మరోవైపు సంక్రాంతి వేడుకల్లో సొంతింటికి, బంధువుల ఇళ్లకు, స్నేహితుల ఇళ్లకు వచ్చే ఆత్మీయుల కోసం అంగరంగ వైభవంగా పల్లెలు, పట్టణాలు ముస్తాబయ్యాయి. తమవారు ఇంటికి వచ్చేసరికి ఇంటికి రంగులు వేసి, రంగవల్లులతో ఆహ్వానం పలికేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తుండడంతో వారం రోజుల ముందుగానే సంక్రాంతి వచ్చిందా అన్నట్టు భీమవరం పరిసర ప్రాంతాలు మారిపోయాయి.