గాలి పటాలతో జాగ్రత్త.. మాంజా నుంచి విద్యుత్ ప్రవహించి..

సంక్రాంతి పండుగ.. ప్రతి ఇంటా ఆనందాల హరివిల్లులు విరుస్తుంటాయి. అమ్మాయిలు రంగవల్లులు తీర్చి దిద్దుతూ సందడి చేస్తే, చిన్నారులు గాలి పటాలు ఎగురవేస్తూ ఆనందిస్తుంటారు. మరి ఈ సరదాల సంక్రాంతిని విషాదంగా మార్చకుండా ఉండాలంటే మాంజాల విషయంలో మరింత జాగ్రత్త అవసరమంటున్నారు పోలీసులు.

గాలి పటాలను ఎరుగరవేసేందుకు చైనా మాంజాలు వినియోగిస్తుండడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. హై టెన్షన్ లైనుకు తగిలిన ఒక మాంజా నుంచి విద్యుత్ ప్రసారం కావడంతో తొమ్మిదేళ్ల బాలిక తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.

రాజస్థాన్‌లోని జైపూర్‌లో అష్రఫ్ ఖాన్ కుమార్తె ఆఫ్రీన్ బానో అనే 9 ఏళ్ల చిన్నారి తమ ఇంటి మేడ మీద గాలిపటం ఎగురవేస్తూ ఆడుకుంటోంది. ఇంతలో గాలిపటానికి ఉన్న మాంజా ఇంటికి సమీపంలో ఉన్న హై టెన్షన్ వైరుకు చుట్టుకుంది. దీంతో దాన్నుంచి విద్యుత్ ప్రసారమై మాంజా పట్టుకుని ఉన్న చిన్నారి షాక్‌కి గురై పడిపోయింది.

వెంటనే గమనించిన కుటుంబసభ్యులు చిన్నారిని హుటా హుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఐదు రోజులుగా చికిత్స పొందుతున్న బానో ఆసుపత్రిలోనే కన్ను మూసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేసి విచారణ చేపట్టారు.