పండగ సీజన్‌.. బస్సు చార్జీలు చూస్తే..

sankranthi effect travel charges huge hike

సంక్రాంతి పండక్కి సొంత ఊళ్లకు వెళ్లాలనుకున్న ప్రజలకు ప్రయాణ కష్టాలు వెంటాడుతున్నాయి. ట్రైన్‌ బుకింగ్స్‌ ఫుల్ అయిపోయాయి. ప్రైవేట్‌, ఆర్టీసీ బస్సుల దోపిడీకి అంతే లేకుండా పోయింది. విమాన చార్జీల మోత మోగిపోతోంది. దీంతో పండగకు ఊరెళ్ల ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు.

Also read : నన్నెందుకు దూరం పెడుతుంది : మంత్రి అఖిల ప్రియ

రైల్వే, బస్‌, విమానం.. ఏది చూసినా పండగకు వెళ్లే ప్రయాణికులు భారంగా మారాయి. అయినా వెళ్లక తప్పని పరిస్థితి. రైల్వే విషయానికి వస్తే… బుకింగ్స్‌ ఎప్పుడో ఫుల్‌ అయిపోయాయి. రిజర్వేషన్‌ చేసుకోని ప్రయాణికులకు జనరల్‌ బోగీలు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేక రైళ్ల ఊసే లేదు. మరోవైపు సూపర్ ఫాస్ట్ ట్రైన్ నిర్ణీత సమయానికి చేరుతుందని చెప్పుకోవడం తప్ప.. సమయానికి రావు. చార్జీలు చూస్తే మూడు రెట్లు ఉన్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పండగ సీజన్‌ కావడంతో ప్రైవేట్‌తో పాటు ఆర్టీసీ బస్సులు కూడా చార్జీలను ఎడాపెడా బాదేస్తున్నాయి. ముక్కుపిండి మరీ ప్రయాణికుల దగ్గర నుంచి రెట్టింపు డబ్బులు వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల కంటే ఇప్పడు ఆర్టీసీ ఛార్జీలు మూడు రెట్లు వసూలు చేస్తుండడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా విజయవాడ నుండి విశాఖకు…విశాఖ నుండి శ్రీకాకుళం విజయనగరం వంటి జిల్లాలకు కుడా ఎంతో మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. పండుగ సీజన్ కాబట్టి రద్దీ తీవ్ర స్థాయిలో ఉండడంతో అధికారులు ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. కానీ ఇక్కడ సీన్ అంతా రివర్స్‌గా ఉంది. బస్సులు నిర్ణీత సమయానికి రాకపోవడం… గంటల తరబడి బస్ ష్టేషన్‌లో వేచి ఉండటం వల్ల ప్రయాణికులు విస్తుపోతున్నారు.

అంతే కాదు సంక్రాంతి రద్దీ విమానాలకు సైతం తాకింది. సాధారణ రోజుల్లో హైదారాబాద్ నుండి విశాఖకు టికెట్ ధర 1500 ఉండేది. పండగ సీజన్ కావడంతో 9 వేల రూపాయలు పెంచారని ప్రయాణికుల లబోదిబోమంటున్నారు. విదేశాలకు వెళ్లాలంటే 5 వేల నుండి టికెట్ ధరలు ఉన్నాయని…కానీ హైదరాబాద్‌ నుంచి విశాఖకు 9 వేలు వసూలు చేయడం ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

ఇక ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. విజయవాడ నుండి విశాఖ వరకు ప్రయాణించాలంటే 3 వేల రూపాయల వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇలా ప్రయాణ కష్టాలతో జనాలకు పండగ సంతోషం లేకుండా పోతేంది.