ప్రత్యేక హోదా ప్రకటనకు కట్టుబడి ఉన్నా : రాహుల్ గాంధీ

special-status-for-andhra-pradesh-if-voted-to-power-rahul-gandhi-tells-workers-in-dubai

తాము అధికారంలోకి రాగానే మొదట చేసేపని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం అన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. గతేడాది మార్చిలో హోదా కోసం ఏపీకి చెందిన నాయకులు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారని, అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని చెప్పారు. రాష్ట్రం విడిపోయాక నవ్యాంధ్రప్రదేశ్‌కు కచ్చితంగా ఇవ్వాల్సిన ముఖ్య హామీని ప్రధాని నరేంద్ర మోడీ మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ఏపీకి ఇవ్వాల్సిన రుణం గురించి మనమంతా భారత ప్రభుత్వానికి, మోడీకి అర్థమయ్యేలా చెప్పాలన్నారు.

Also read : చంద్రబాబు నిర్ణయంతో గ్రామాల్లో రెండ్రోజుల ముందే సంక్రాంతి

రెండు రోజుల పర్యటన నిమిత్తం దుబాయ్‌లో ఉన్న రాహుల్‌.. అక్కడ పని చేస్తున్న భారతీయ కార్మికులను కలిశారు. స్థానిక లేబర్‌ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్‌ మాట్లాడారు. ఢిల్లీ జంతర్‌మంతర్‌లో ఏపీ నేతల ఆందోళన సందర్భంగా తాను ప్రత్యేక హోదాపై ప్రకటన చేశానని.. దానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. విభజనతో నష్టపోయిన ఏపీకి న్యాయం జరగాల్సిందేనని స్పష్టం చేశారు రాహుల్.

దుబాయ్ అభివృద్ధిలో భారతీయ కార్మికుల పాత్ర చాలా ఉందని కొనియాడారు రాహుల్. యూఏఈలోని ఎత్తైన భవనాలు, మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలన్నీ భారతీయ కార్మికుల చెమటతోనే నిర్మితమయ్యాయన్నారు. దుబాయ్‌ పర్యటనలో ఉన్న రాహుల్.. భారత పారిశ్రామికవేత్తలతోనూ సమావేశమయ్యారు. స్వదేశంలో పెట్టుబడులు పెట్టి యువతకు ఉద్యోగాలు కల్పించాలని, వ్యయసాయాభివృద్ధికి సహకరించాలని వారిని విజ్ఞప్తి చేశారు.