‘ఐ లవ్యూ మెసేజ్’ ఎక్కడినుంచి అని భార్యని అడిగినందుకు..

ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య.. తనని, బిడ్డని వదిలేసి వెళ్లి పోయింది. దీంతో కలత చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మా, నాన్న ఏమయ్యారో తెలియని చిన్నారి, ఇవేవీ అర్థంకాక ఆకలితో అల్లాడుతూ అమ్మానాన్నల కోసం ఏడుస్తున్నాడు.

కడప జిల్లా, ఊటూరు మండలం, డొంగూరు గ్రామానికి చెందిన ఎర్రగోను మల్లికార్జున్ రెడ్డి కుమారుడు చరణ్ రెడ్డి, విజయవాడకు చెందిన పావని రెడ్డి ప్రేమించుకున్నారు. వారి ప్రేమను కాదన్న పెద్దలని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. చింతల్ పద్మానగర్‌లో కాపురం పెట్టారు. ఆ తరువాత వారికి ఓ మగబిడ్డ కూడా పుట్టింది.

ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ చరణ్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆనందంగా సాగిపోతున్న వారి సంసారంలో చిన్న చిన్న కలతలు మొదలయ్యాయి. ఓ రోజు భార్య పావని ఫోన్‌కి ‘ఐ లవ్యూ అని మెసేజ్ వచ్చింది. దాన్ని చూసిన భర్త ఎవరతను అని అడిగాడు. దాంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. భర్త తనని నిలదీశాడని కలత చెందిన పావని ఏడాదిన్నర కొడుకుని, భర్తని వదిలేసి వెళ్లి పోయింది.

మూడు రోజులైనా భార్య జాడలేదు. ఆమె తిరిగి రాకపోయేసరికి చరణ్ మనస్థాపానికి గురయ్యాడు. దీంతో గురువారం రాత్రి చరణ్ కుమారుడిని నిద్ర పుచ్చి ఇంట్లో ఐరన్ రాడ్డుకు చీరతో ఉరివేసుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున బాబు ఏడుస్తుండడంతో పక్కింటి వారు విని తలుపు కొట్టారు. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో ఇరుగు పొరుగు వారు కిటికీలోనుంచి చూశారు.

వారికి చరణ్ ఊరివేసుకుని కనిపించాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అమ్మానాన్న లేక అనాథగా మారిన బిడ్డని చూసి స్థానికులు కలత చెందుతున్నారు.