మంత్రి పదవులు వీరికేనా..?

who is telangana cabinate ministers

టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరి దాదాపు నెలరోజులు కావస్తోంది. ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం పూర్తి కాగానే…. కొత్త మంత్రి వర్గం కొలువుదీరుతుంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. ఒక వైపు గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అధ్యక్షా అనాలని కుతుహ‌ల‌ప‌డుతుంటే.. మంత్రి ప‌దవి ఆశావ‌హులు మాత్రం.. క్యాబినెట్‌ విస్తరణ కెసీఆర్ ఎప్పుడు చేప‌డ‌తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇప్ప‌టికే త‌న‌తో పాటు హోంమంత్రిగా మ‌హ‌మూద్ అలీ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. సంక్రాంతి మూడాలు అయిపోగానే మినీ క్యాబినెట్ ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని టీఆర్ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈనెల 18 న మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉండొచ్చ‌ని అంద‌రూ అంచ‌నా వేస్తున్నారు. అప్ప‌టికే అసెంబ్లీ ప్రారంభం కావ‌టంతో పాటు 18 నే అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ఉంటుంద‌ని కాబ‌ట్టి ఖ‌చ్చితంగా ఆ స‌భ‌లో కొత్త మంత్రులు ఉంటార‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. అయితే ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో జ‌రుగుతున్న ప‌రిణామాలు గ‌మ‌నిస్తున్న వాళ్ళు… 18 ముహూర్తాన్ని గ‌ట్టిగా చెప్ప‌లేక‌పోతున్నారు.

Also read : అందుకే సంచలన నిర్ణయం తీసుకున్న ఆలోక్‌ వర్మ

అటు ఫాం హౌస్‌ లో.. ఇటు ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో కొత్త ప‌థ‌కాల అమ‌లు కార్యాచ‌ర‌ణ‌, .. పాత ప‌థ‌కాల కొన‌సాగింపుకు ఆర్థిక వ‌న‌రుల స‌మీక‌ర‌ణ లాంటి అంశాల‌పై సీఎం కేసీఆర్ క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. సంక్రాంతి త‌ర్వాత ఉండొచ్చ‌ని నేత‌లు అంచ‌నా వేస్తున్న నేత‌లు.. 18 న మంచి రోజు కాబ‌ట్టి .. ఆరోజే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఒక వేళ 18 న గ‌నుక మినీ క్యాబినెట్ విస్త‌ర‌ణ లేక‌పోతే.. ఇక ఫిబ్ర‌వ‌రిలోనే మంత్రి వర్గం విస్తరణ జరిగే అవకాశముందన్నది గులాబీనేతల మాట. ఇప్పటి వ‌ర‌కు మంత్రి ప‌ద‌వుల‌పై కేసీఆర్ ఒక్కరికి కూడా హామీ ఇవ్వ‌లేద‌ని తెలిసింది. కాని ఆశావ‌హులు మాత్రం ఎప్పుడు క్యాబినెట్ విస్త‌ర‌ణ ఉన్నా.. త‌మ‌కు అవ‌కాశం ద‌క్కాల‌ని .. అటు ప్ర‌గ‌తి భ‌వ‌న్., ఇటు తెలంగాణ భ‌వ‌న్ కు వ‌చ్చి కేసీఆర్‌, కేటీఆర్ ల‌ను క‌లుస్తున్నారు.

ఎప్పుడు ప్ర‌క‌ట‌న వ‌చ్చినా .. 8 మందికి మించ‌కుండానే క్యాబినెట్ ఉండొచ్చ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. పరిపాలనా సౌలభ్యం కోసం ఆరు నుంచి ఎనిమిది మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించి …మిగతా వారిపై పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఫ‌స్ట్ లిస్టులోనే అవ‌కాశం ద‌క్కించుకునేందుకు పోటీ పడుతున్నారు నేత‌లు. మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ , ఎర్రబెల్లి దయాకర్ రావు , ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ , జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , శ్రీనివాస్ గౌడ్ రెండు మూడు రోజుల‌కొక‌సారి కేటీఆర్ ను క‌లిసేందుకు తెలంగాణ భవన్ కు వస్తున్నారు. అటు ప్ర‌గ‌తి భ‌వ‌న్ లోకూడా ఏదో ఒక ప‌నిమీద కేసీఆర్ ను క‌లిసి ఆయ‌న క‌నుస‌న్న‌ల్లో ప‌డేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

తొలి విడత విస్తరణలో గులాభి బాస్ కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులు… పార్టీ విధేయులతో పాటు సామాజిక సమీకరణాలను పరిగణన‌లోకి తీసుకోవ‌చ్చ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఆశావ‌హులు త‌మ ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, నిజామాబాద్ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మెదక్ నుంచి హరీష్ రావు, పద్మాదేవెందర్ రెడ్డి, కరీంనగర్ నుంచి ఈటెల రాజెందర్, కొప్పుల ఈశ్వర్ , వరంగల్ నుంచి…ఎర్రబెల్లి. దయాకర్ రావు, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కడియం శ్రీహరి, ఎస్టీ కోటాలో రెడ్యానాయక్, మహబూబ్ నగర్ నుంచి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ , నల్గొండ నుంచి జగదీశ్ రెడ్డి ,గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఇక హైదరాబాద్ నుంచి తలసాని , దానం నాగేందర్ పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన మాజీ మంత్రి తుమ్మ‌ల కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చి .. మంత్రి వ‌ర్గం లోకి తీసుకునే అవ‌కాశం లేక‌పోలేద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మల్లారెడ్డి, మైనం పల్లి హన్మంతరావులు కూడా పదవులు ఆశిస్తున్నవారిలో ఉన్నారు.

ఇక మంత్రి వర్గంలో స్థానం లభించని ఎమ్మెల్యేలకు విప్ పధవులు, పార్లమెంటరీ సెక్రెటరీపోస్టులు ఇవ్వాలని గులాభి బాస్ యోచిస్తున్నారు. ఈ అసెంబ్లీ స‌మావేశాల్లోనే విప్ పదవులు ఇచ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రేఖా నాయక్, బాల్క సుమన్, దాస్యం వినయ భాస్కర్, ఆరూరి రమేష్ , కోనేరు కోనప్ప, ఒడితెల సతీష్ కుమార్ , షకీల్, గంగుల కమలాకర్, రామలింగా రెడ్డి, జీవన్ రెడ్డి, పట్నం నరెందర్ రెడ్డి, వివేకా నంద గౌడ్ లకు విప్ ప‌ద‌వులు ద‌క్క‌వ‌చ్చ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. మొత్తానికి క్యాబినెట్ విస్త‌ర‌ణ ఎప్పుడు ఉంటుందో బాస్ కేసీఆర్ మ‌న‌స్సులో ఏముందోన‌ని టీఆర్ ఎస్ నేతల్లోన‌ ఆస‌క్తి నెల‌కొంది.