సంక్రాంతి వేళ అన్ని ఊళ్లు సందడిగా మారితే…ఆ ఊరు మాత్రం..

sankranthi
sankranthi

ఆ ఊరు ఊరంతా హరిదాసులే! హరి కీర్తనలు ఆలపించే వారే. సంక్రాంతి వేళ అన్ని ఊళ్లు సందడిగా మారితే…ఆ ఊరు మాత్రం వలస బాటలో ఉంటుంది. పండగ పూట పల్లెల్లో సంచరిస్తూ భద్రాద్రి రాముణ్ని దర్శించుకొని మళ్లీ సొంతూరికి రావటం అక్కడి హరిదాసుల ఆచారం.

తెలుగులోగిళ్లు పండగ శోభ సంతరించుకున్నాయి. పల్లెలు సంక్రాంతి సందడితో కళకళలాడుతున్నాయి. పెద్ద పండుగగా భావించే ఈ సంక్రాంతి సాంప్రదాయంలో హరిదాసులకు ప్రత్యేకత స్థానం ఉంది. చుట్టాలు రాకముందే ఊరి బంధువుగా వచ్చే హరిదాసుల కోలాహలం సంక్రాంతికి నెల రోజుల ముందే మొదలవుతుంది. ధనుర్మాసం నెలరోజులూ వారి భక్తి పాటలతో ప్రతి ఇంటినీ పావనం చేస్తారు హరిదాసులు.

తెలతెల్లవారగానే ఇంటి ముందు రామదాసు, అన్నమయ్య కీర్తనలు వినిపించే ఈ హరిదాసులు…తమకు వారసత్వంగా వస్తున్న సాంప్రదాయన్ని నిష్టగా కొనసాగిస్తున్న పల్లె నారాయణపురం. విశాఖ జిల్లా రాంబిల్లి మండలంలో ఉంది ఈ పల్లె. ఊరి పేరుకు తగినట్లే ఇక్కడివారు నిత్యం నారాయణున్ని కీర్తిస్తూ జీవనం గడుపుతున్నారు. దాదాపు 130 హరిదాసుల కుటుంబాలు ఉన్నాయిక్కడ.

కాషాయ వస్త్రాలు, నుదుట నామాలు, మెడలో రుద్రాక్ష మాలలు, పూలదండలు, నెత్తిపై అక్షయపాత్రతో హరిదాసుల అలంకరణ ఉంటుంది. భుజాన తంబురా, చిడతలతో రామదాసు, అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ లయబద్ధంగా గజ్జె కట్టిన కాళ్లతో ఆడుతూ సంక్రాంతి సీజన్ లో భిక్షాటనకు బయల్దేరుతారు. దాదాపు రెండు నెలలు పాటు వీరి పరిధిలోని గ్రామాల్లో సంచరిస్తారు. అలా వచ్చిన గ్రాసం, డబ్బులతోనే సంవత్సరమంతా వెళ్లదీస్తారు.

కాలం మారుతోంది. దీంతో హరిదాసులు కూడా జీవనవిధానాన్ని మార్చుకుంటున్నారు. ఉద్యోగాలు, ఇతర పనుల వైపు దృష్టి సారిస్తున్నారు. అయితే నారాయణ పురం హరిదాసులు మాత్రం తమకు వారసత్వంగా వచ్చిన సాంప్రదాయాన్ని విడిచిపెట్టబోమని అంటున్నారు.