పార్టీ శ్రేణులకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం

bjp ready to election 2019

దేశ రాజధాని వేదికగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల శంఖారావం మోగించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమ్మేళనం పూర్తిగా లోక్‌సభ ఎన్నికల మూడ్‌లో సాగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అగ్రనేత అద్వానీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలతో పాటు 12 వేల మంది పాల్గొన్న ఈ సమావేశాల్లో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహం, ఓటర్లను ఆకట్టుకోవడానికి చేయాల్సిన కార్యక్రమాలు, విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడానికి అనుసరించాల్సిన ఎత్తుగడలపై సమాలోచనలు జరిపారు. వ్యవసాయ సాయ రంగ సమస్యలు, రామమందిర నిర్మాణ అంశం, ఈబీసీ రిజర్వేషన్లపై పార్టీ శ్రేణులకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం చేశారు. ఎస్సీ-ఎస్టీ-బీసీ రిజర్వేషన్లకు ఏమాత్రం నష్టం కలగకుండా ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చామని మోదీ స్పష్టం చేశారు.

Also read : హెచ్‌1 బీ అనేది నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసా

వ్యవసాయరంగ సమస్య పరిష్కారానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. ఈ దేశ రైతులకు నూతన జవసత్వాలు ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. అభివృద్ది విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. అందరికీ అన్నం పెట్టే రైతన్నకు కడుపునింపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

దేశాన్ని కాంగ్రెస్ పార్టీ చీకట్లోకి నెట్టేసిందని మోదీ నిప్పులు చెరిగారు. 2004 నుంచి 2014 మధ్య అత్యంత ముఖ్యమైన పదేళ్ల కాలంలో కుంభకోణాలు, అవినీతితో దేశం తీవ్రంగా నష్టపోయిందన్నారు. దేశ చరిత్రలో అవినీతి మరక అంటని ప్రభుత్వం తమదేనన్న మోడీ…. ఇలాంటి ప్రభుత్వం ఏర్పడటం ఇదే తొలిసారన్నారాయన. బెయిల్ పై తిరుగుతున్న నాయకులు, తమపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. నిజాయితీగా సేవ చేసే వారినే ఎన్నుకోవా లని ప్రజలకు పిలుపునిచ్చారు.

రామ మందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని మోదీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులే రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారని విమర్శించారు.

కుటుంబ రాజకీయాలు, కులరాజకీయలు, బుజ్జగింపు రాజకీయాల అనే మూడు సమస్యలు దేశాన్ని పట్టి పీడి స్తున్నాయని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా దుయ్యబట్టారు. 22 కోట్ల కుటుంబాల ఆశీర్వాదం బీజేపీకి ఉందన్న అమిత్‌షా….. ఎలాంటి పొత్తులు తమను ఓడించలేవన్నారు. పార్లమెంట్‌ నుంచి పంచాయతీ వరకు బీజేపీ గెలుపు సాధిస్తుందన్నారు.

ప్రజల భాగస్వామ్యంతోనే సబ్ కా సాత్-సబ్ కా వికాస్, ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్ సాకారమవుతుందని ప్రధాని స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలంతా లక్ష్యం వైపు కలిసికట్టుగా కదలాలని సూచించారు. ప్రతి కుటుంబాన్ని కలుసుకుంటూ బీజేపీ ప్రభుత్వ అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని దిశానిర్దేశం చేశారు.