ముగ్గురు మోడీలతో పోరాడాలని సీఎం చంద్రబాబు పిలుపు..

cm chandrababunaidu talk about pattiseema and krishna godhavari

ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాశ్రయ భద్రత కేంద్రానిదేనని అయితే విచారణ, దర్యాప్తు అధికారం రాష్ట్రానిదేనని చెప్పుకొచ్చారు. ఎన్ఐఏకు అప్పగించడంపై కోర్టులో తేల్చుకుంటామని హెచ్చరించారు చంద్రబాబు. కేసును ఎన్ఐఏకి అప్పగించడానికి అసలు మీరెవరంటూ ప్రధాని నరేంద్రమోడీని ప్రశ్నించారు. ఒకప్పుడు ఎన్ఐఏపై నమ్మకం లేదన్న మోడీ ఇప్పుడు ఎన్ఐఏను ఏపీలో దించడం వెనుక ఆంతర్యం ఏంటని నిలదీశారు. ఇష్టం వచ్చినట్లు రాష్ట్ర హక్కులను హరిస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Also read : బడ్జెట్‌ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష

ఎన్డీఏలో ఉన్నంత వరకు తమను పొగిడిన బీజేపీ… మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత అవినీతిపరులు అంటూ వ్యాఖ్యానిస్తున్నారని విమర్శించారు చంద్రబాబు. అప్పుడు నీతిమంతులం ఇప్పుడు అకస్మాత్తుగా అవినీతిపరులం అయిపోయామా అని విరుచుకుపడ్డారు. మోదీపై కూడా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు. రఫేల్‌ డీల్ అవినీతిపై ఏం చెప్తారన్నారు. అవినీతి కేసు ఉంది కాబట్టే సీబీఐ డైరెక్టర్ నుంచి అలోక్ వర్మను రాత్రికి రాత్రే మార్పించేశారని ఆరోపించారు. సీబీఐని అస్తవ్యస్తం చేశారని దుయ్యబుట్టారు. అందువల్లే సీబీఐకి సాధారణ సమ్మతిని వెనక్కి తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

రాష్ట్రానికి 75వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జేపీ కమిటీ స్పష్టం చేసిందన్నారు. ఇటీవల కేంద్రం 30 వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా వున్నా ప్రధాని మోడీ అడ్డుపడటం వల్ల ఇవ్వడం లేదనే వార్తలొచ్చాయని, ప్రధానమంత్రి ఎందుకు అడ్డుపడుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం చంద్రబాబు. పేదవారికి పెన్షన్ ఇచ్చామనే నెపంతో ఏపీకి రావాల్సిన 16 వేల కోట్ల రూపాయల్లో కోత కోశారని ఆవేదన వ్యక్తం చేవారు. పేదవారికి పెన్షన్లు ఇవ్వడం నేరమా?అని చంద్రబాబు ప్రశ్నించారు. 660 పురస్కారాలు ఏపీకి వచ్చాయని, వర్షాభావంతో పాటు 3 తుఫాన్లు ఎదుర్కొన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.

ముగ్గురు మోడీలతో మనం పోరాడాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఢిల్లీ మోడీ, తెలంగాణ మోడీ, ఏపీ మోడీలతోనే మన పోరాటమని, 90 రోజుల్లో ఎన్నికలు రానున్నాయని చెప్పారు. జగన్‌ పాదయాత్ర చేసి హైదరాబాద్‌ వెళ్లారని, అమరావతిని పట్టించుకోలేదని విమర్శించారు. సీబీఐ కోర్టు ఏపీకి వస్తే అప్పుడు జగన్‌ అమరావతికి వస్తారేమోనని ఎద్దేవా చేశారు… ప్రజలు బాగుపడితే వైసీపీకి కడుపు మంటని మండిపడ్డారు. కేంద్రం తీరుతో అందరిలో అసహనం పెరుగుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.