ఆన్ లైన్ లో పందెం కోళ్లు.. ధర చూస్తే..

pandhem kodi in olx and quicker

పందెంకోళ్ల బిజినెస్ కొంత పుంతలు తొక్కుతోంది. కోళ్ల అమ్మకాలను ఆన్ లైన్ అవుతున్నాయి. olx, quicker లాంటి వెబ్ సైట్లలో పెందెం కోళ్ల అమ్మాకాలకు తెరతీశారు అమ్మకందారులు. కోడి బ్రీడ్, రంగు, రేటుతో సహా అన్ని వివరాలను అప్ లోడ్ చేసి అమ్మకానికి పెడుతున్నారు. కోడి జాతిని బట్టి 2 వేల నుండి లక్ష రూపాయల వరకు రేటును ఫిక్స్ చేస్తున్నారు.

సాంప్రదాయ కోడిపందాలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. బరిలో కత్తులు దూసే కోళ్లను ఎంపిక చేసుకోవటం కత్తిమీద సామే. ఏ జాతి కోడి మీద ఏ జాతి కోడిని బరిలోకి దింపాలి.. ఏ రంగు కోడి ఏ సమయంలో పోటీకి పంపాలో ముహూర్తం చూసుకోవాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఏ కోడి ఎంత రేటు ఉంటుంది, ఎక్కడ కొనుగోలు చేయాలనేది ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు కష్టమే. వారికి పందెం కోళ్లు సులభంగా దక్కేందుకు తాజాగా పశ్చిమగోదావరిజిల్లాలో కొందరు olx, quicker వంటి ఆన్ లైన్ అమ్మకాల్లో పెట్టి అమ్ముతున్నారు.

ఈ హైటెక్ అమ్మాకాలతో పందెం కోడి కోసం వెతకే అవసరం లేకుండా.. ముందుగానే ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చి భారీ ధరకు కొనేసుకుంటున్నారు పందెంరాయుళ్లు. హైదరాబాద్, తెలంగాణ, బెంగుళూరుతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చి బెట్టింగులు కాసే వారికి ఆన్ లైన్ అమ్మకాలు ధీమాను ఇస్తున్నాయి. వెబ్ సైట్లలో కోడి జాతి, రంగు తో పాటు పందెం కోడి రేటును కూడా ఇవ్వడంతో olx లో కొనుగోళ్లు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

భీమవరం, ఆచంట, చింతలపూడి, పాలకొల్లు, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం, ఆకివీడు ప్రాంతాలకు చెందిన కోళ్ల శిక్షణ కేంద్రాల నిర్వాహకులు సైతం ఆన్ లైన్ లో అమ్ముతుండడం గమనార్హం. స్మార్ట్ ఫోన్లు తెస్తున్న మార్పునకు ప్రతీకగా ఈ ఆన్ లైన్ లో కోళ్లు అమ్మకాలు నిలవడంతో, స్మార్ట్ ఫోన్లు ఇంకెన్ని మార్పులు తెస్తాయో అని ఈ కోళ్లను చూసినవారు ఆశ్చర్యపోతున్నారు.