ఆయనపై గుర్రుగా ఉన్నఇద్దరు నేతలు

political situation in ongole

అభివృద్దిలో వెనకబాటు… కరవులో ముందు… వలసల్లో టాప్… ఇది క్లుప్తంగా ప్రకాశం జిల్లా గురించి చెప్పాలంటే. వెనకబాటు ప్రజలకే.. నాయకులు ముందు ఎప్పుడూ ముందే ఉంటారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లాలోని పాత తరం, కొత్తతరం నాయకులు మేమున్నామంటూ తెరపైకి వస్తున్నారు. ఓవైపు వారసత్వ రాజకీయాలు మరోవైపు కొత్త ఫేసులు పోల్ రేసులోకి వస్తున్నాయి. సైకిల్‌, ఫ్యాన్…ఇవి రెండే ప్రధాన పక్షాలు అన్న తరుణంలో నేను కూడా వస్తున్నా అంటూ జనసేన బరిలోకి వచ్చింది.

Also read : ముగ్గురు మోడీలతో పోరాడాలని సీఎం చంద్రబాబు పిలుపు..

నిన్నటిదాకా మిత్రులుగా ఉన్న సైకిల్, కమలం దోస్తీకి రెండు పార్టీలు కటీఫ్ చెప్పుకున్నాయి. ఎర్రదండుకు అనుకోకుండా పవన్ కళ్యాణ్ రూపంలో కొత్త అండ దొరికింది. మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఉనికి లేదనుకున్న హస్తం కూడా రేసులోకి వచ్చింది. ప్రత్యేక హోదాతో జనంలో మైలేజీ తెచ్చుకున్న ఫ్యాన్ జిల్లాలో మొదట్లో కాస్త ఉత్సాహంగా ఉన్నా..సైకిల్, కమలం మైత్రికి బ్రేక్ పడటంతో సైకిల్‌ స్పీడ్ పెరిగింది. యూటర్న్… మరో టర్న్‌ మాట ఏదైతేనేం…తమ్ముళ్లు కూడా హోదా పోరులో మేము సైతం అని గళం విప్పడంతో ఫ్యాన్ స్పీడ్ తగ్గింది. కమల దళానికి జిల్లాలో ఒంటరిగా పోటీచేసే సత్తా లేదన్నది బహిరంగ రహస్యం. కాబట్టి వారితో పొత్తు ఉన్నా… ఊడినా TDPకి వచ్చే లాభం కానీ నష్టం కానీ లేదు. ఇక, కొత్త కుంపటి జనసేన… కుల సమీకరణాల నేపథ్యంలో కొంత ప్రభావం చూపినా…ఆ పార్టీ వైఖరి కమల దళానికి అనుకూలంగా ఉందన్న వాదన మైనస్ అయింది. జనం తిరస్కరణకు గురైన హస్తం…హోదా సెంటిమెంట్ తో కొంచెం జీవం పోసుకుంది. జిల్లాలో పోటీ సైకిల్ ఫ్యాన్ మధ్యే అని చెప్పక తప్పదు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రమంతా తెలుగుదేశం గాలి వీచినా ప్రకాశం జిల్లాలో మాత్రం భిన్నవాతావరణం కనిపించింది. జిల్లాలోని 12 నియోజవర్గాల్లో ఆరు వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. 5 నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. చీరాల నియోజక వర్గంలో మాత్రం ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కందుకూరు, అద్దంకి , యర్రగొండపాలెం, గిద్దలూరు ఎమ్మెల్యే లతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన చీరాల ఎమ్మెల్యే TDP గూటికి చేరారు. దీంతో బలాబలాలు తారుమారయ్యాయి. అధికారపార్టీ పక్షాన పదిమంది ఎమ్మెల్యేలు ఉండగా ప్రతిపక్ష వైసీపీలో ఇద్దరు మాత్రమే మిగిలారు.

జిల్లా కేంద్రం ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టటంతో పాటు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారన్న టాక్‌ ఉంది. సో ఆయన పట్ల వ్యతిరేకత లేదు. కానీ గ్రూపుల కుమ్ములాటలను ప్రతికూలంగా మారాయి. సీనియర్‌ ఎమ్మెల్సీలు కరణం బలరామకృష్ణమూర్తి, మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎమ్మెల్యే దామచర్ల పట్ల గుర్రుగా ఉన్నారు. పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరును అధిష్టానం కట్టడి చేయకపోతే ప్రతిపక్ష వైసీపీకి అయాచిత వరంగా మారుతుందని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ నుంచి మాజీ మంత్రి బాలినేని పోటీకి రంగం సిద్దం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలతో కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. సిటీలో దామచర్ల వర్సెస్ బాలినేని హోరాహోరీ కనిపిస్తోంది.

కనిగిరిలో ప్రతిపక్షపార్టీలోని గ్రూపు తగాదాలు కదిరి బాబురావుకు కలిసి వచ్చే అంశం. స్థానికేతరుడైన బుర్రా మధుసూదన్ యాదవ్ వైసీపీ నాయకత్వం వహిస్తుండటంతో స్థానిక నేతలు ఆయనకు సహకరించడం లేదు. రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం అధికంగా ఉండే ఈ నియోజక వర్గంలో బీసీ వర్గానికి చెందిన మధుసూదన్ 2014 ఎన్నికల్లోనూ పోటీచేసి ఓడిపోయారు. కులాల కుమ్ములాటలే బుర్రాకు శాపంగా మారాయి. దీంతో మరోసారి కదిరి బాబూరావు విజయంపై ధీమాగా ఉన్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కూడా టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. బాబూరావుకు నందమూరి బాలకృష్ణ ఆశీస్సులున్నాయి. మరి అధినేత ఎవరికిస్తారన్నది చూడాలి. వైసీపీ కూడా చివరి నిమిషంలో అభ్యర్ధిని మార్చే అవకాశం లేకపోలేదన్న చర్చ నడుస్తోంది.