సంక్రాంతి సెలవులు పిల్లలకు మరపురాని జ్ఞాపకాలు

sankranthi celebrations in children

సంక్రాంతి.. తెలుగు వారి పెద్ద పండుగ… పుడమికీ, ప్రకృతికీ, గోసంతతికీ, సమాజంలో మనకు చేదోడుగా ఉన్న వారికీ కృతజ్ఞతలు చెప్పుకొనే అవకాశాన్ని కలిగించే పర్వం… భోగి మొదలు ముక్కనుమ వరకూ వాడవాడలా ఆనందోత్సాహాలతో నిర్వహించుకొనే ఈ వేడుక మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం…

Also read : నారావారిపల్లెకు సంక్రాంతి కళ..

ఎక్కడెక్కడికో బతుకుదెరువుకు వెళ్లినవారు తప్పకుండా సంక్రాంతికి సొంత ఊళ్లకు చేరడం సర్వసాధారణం. చల్లని గాలుల నడుమ, పచ్చని పైరుల నడుమ ప్రతి ఊరు, ప్రతి ఇల్లు ధాన్యపు రాశులతో, డూ.. డూ.. బసవన్నల నృత్యాలు, గంగిరెద్దు విన్యాసాలు, ఉషోదయాన్నే హరిదాసు చేసే గజ్జల చప్పుళ్లు… జంగర దేవరలు, హంగామాతో హాస్యాన్ని పండించే పగటి వేషగాళ్లు సందడి చేసేందుకు రెడీ అయ్యారు…

ఇళ్ల ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేయడం, ఆ ముగ్గులకు అందమైన రంగులు అద్దడం ముచ్చట గొలుపుతుంది. సంక్రాంతి సందర్భంగా రథం ముగ్గులు, చుక్కల ముగ్గులు వేస్తారు. ముంగిట్లో రకరకాల రంగవల్లులతో వీధులు ఇంద్రధ్రనస్సును తలపిస్తుంటాయి….

సంక్రాంతి సెలవులంటే పిల్లలకు మరపురాని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. బాలలకు సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. సంక్రాంతి రోజుల్లో ఆకాశాలు పతంగులతో సరికొత్త అందాలు సంతరించుకుంటాయి. పోటీపడి మరీ పెద్ద పెద్ద పతంగులు తయారు చేయడం.. పతంగులను అత్యంత ఎత్తుకు ఎగరేయడం.. ఒకరి గాలిపటాన్ని మరొకరు పోటీపడి తెంపేయడం.. ఇలా పిల్లలు, కుర్రకారు గాలిపటాల సందడికి హద్దే ఉండదు.

ఇక చాలా ప్రాంతాల్లో సంక్రాంతి రోజుల్లో బొమ్మల కొలువులు నిర్వహిస్తారు. ఈ బొమ్మల కొలువుల్లో మన దేవుళ్లు, పురాణ పాత్రలు, గ్రామీణ వృత్తుల బొమ్మలు.. ఇలా అనేక రకాల బొమ్మలను కొలువుతీరుస్తారు. ఇక భోగి పండుగ రోజులు పిల్లలను ప్రత్యేకంగా అలంకరించి వారికి భోగిపళ్లు పోయడమూ ఓ తీపి జ్ఞాపకమే.

ఇక ఏపీలోని చాలా గ్రామాలు కోళ్ల పందేలకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లోని కోడి పుంజులు సమరానికి సై అంటూ కాళ్లు దువ్వుతున్నాయి. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండగంతా కోళ్ల పందేల్లోనే ఉంటుంది. సుప్రీంకోర్టు నిషేధం విధించినా ఇక్కడ బహిరంగంగానే పందేలు జరుగుతుంటాయి… మరోవైపు సంక్రాంతి పిండి వంటలు ప్రతి ఒక్కరినీ నోరూరిస్తాయి.