మీరు తిరుమల వెళ్తారా. .అయితే ముందుగా..

lord-venkteswara
lord-venkteswara

మీరు తిరుమల వెళ్తారా. ముందుగా ఏ దైవాన్ని దర్శించుకోవాలి. వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందు ఏ ఆలయానికి వెళ్లాలి. ఎవరిని పూజించాలి. అలాగే కలియుగ దైవం పూజలకు ముందు మొదటి పూజ, నివేదనలు ఎవరికి నిర్వహిస్తారు?. మరి ఇవన్ని భక్తులకు తెలుస్తున్నాయా. ధర్మప్రచార పరిషత్‌ పాత్ర ఏంటి. TTD ఏం చేయాలి.. మరేం చేస్తోంది.?

కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం. నిత్య కల్యాణం పచ్చ తోరణం. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుని దర్శనార్థం ప్రతి రోజూ వేలాదిమంది భక్తులు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తారు.

శ్రీవారి దర్శనానికి ముందు శ్రీ వరాహ స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీ. నాటి నుంచి ఇప్పటి వరకు సుప్రభాతం మొదలుకొని అన్ని నిత్య సేవలు వరాహ మూర్తి తరువాతే వెంకటేశ్వరునికి పూజ నివేదనలు చేస్తున్నారు. నైవేద్యం కూడా వరాహ స్వామికి నివేదించిన తర్వాతే శ్రీవారికి నైవేద్య నివేదన చేస్తారు. .

మొదటి నైవేద్యం, పూజలు వరాహ స్వామి వారికే నివేదించాలని సాక్షాత్‌ శ్రీనివాసుడే నిర్ణయించిన నియమాలు కాబట్టి తరతరాలుగా పూజ విధానాలలో మార్పులకు తావు లేకుండా అర్చకులు విధిగా నిర్వహిస్తున్నారు. శ్రీనివాసుడి వాగ్దానం ప్రకారం తన దర్శనానికి ముందు భూ వరాహ స్వామిని దర్శనం చేసుకుంటే దర్శన పుణ్యఫలం.


శ్రీవారి దర్శనానికి రోజుకు 70వేల నుంచి 90 వేల మంది వస్తుంటే భూ వరాహ స్వామి వారిని మాత్రం రోజుకు 5వేల నుంచి 6 వేల మంది భక్తులు మాత్రమే దర్శించుకుంటున్నారు. కోనేటిరాయుడికి ముందు వరాహ స్వామిని దర్శించుకోవాలని తెలియచెప్పే సూచికలు… స్థల పురాణం ఎక్కడ లేవు. భక్తులకు అవగాహన కల్పించడంలో టీటీడీ చొరవ చూపకపోవడంతో 70 నుంచి 80 శాతం మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని తిరుగుపయనం అవుతున్నారు.

తిరుమల క్షేత్ర చరిత్ర, దర్శన నియామాల గురించి భక్తులకు తెలియజేయడంలో టీటీడీ విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమాచార బోర్డులు ఏర్పాటు చేస్తే భక్తులకు చరిత్ర తెలిసే అవకాశం ఉంది. కరపత్రాలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలంటున్నారు భక్తులు.