ఆపరేషన్ కమల్.. బీజేపీలోకి ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

bjp-and-congress

కర్నాటకలో రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారాయి. కూటమికి ముప్పు రాబోతున్నట్లు కాంగ్రెస్- JDS‌లో కలవరం మొదలైంది. ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీ క్యాంపు వెళ్లినట్లు సమాచారం. మరికొంత మంది కూడా అదే బాటలో ఉన్నట్లు టాక్‌. కానీ బీజేపీ మాత్రం ఇదంతా కాంగ్రెస్ డ్రామా అంటూ కౌంటర్‌ ఇస్తోంది. మరి కర్నాటకలో కూటమి సర్కారు కూలనుందా? బీజేపీ అధికారం చేపట్టబోతోందా?

కర్నాటకలో పవర్ గేమ్ కొనసాగుతోంది. పది మంది ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరనున్నారనే వార్తలు వస్తుండడంతో కాంగ్రెస్-జేడీఎస్‌ నేతలకు టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ క్యాంపు వెళ్లినట్లు సమాచారం. ఈ ముగ్గురూ కాంగ్రెస్ నేతలకు టచ్‌లో లేకుండా పోయారు. వారి ఫోన్లు కూడా పనిచేయడం లేదు. దీంతో వీరంతా బీజేపీ నాయకుడికి చెందిన ముంబయిలోని ఓ హోటల్‌కు తరలించినట్లు కర్నాటక జలవనరుల శాఖ మంత్రి, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ఆరోపించారు. ఆపరేషన్ కమలం ద్వారా కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి సర్కారును ఏర్పాటు చేయడానికి బీజేపీ ఎత్తులు వేస్తున్నట్లు ఆయన ఆక్షేపించారు.

మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ జర్కిహోలిని బీజేపీ తమవైపు తిప్పుకుంది. ఆయనతోనే బీజేపీ కథ నడిపిస్తోందని, కూటమి సర్కారును కూలదోయాలని ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపణ. జేడీఎస్-కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 12 సార్లు ప్రయత్నించారనేది వారి ఆక్షేపణ. ప్రస్తుతం ముగ్గురు బీజేపీ క్యాంపుకు వెళ్లగా… మరో 15 మంది వరకు కమల దళంలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. కానీ ఈ వార్తలను కర్నాటక సీఎం కుమార స్వామి, డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర ఖండిస్తున్నారు. సోమవారం ఉదయమే తాను ఆ ముగ్గురు ఎమ్మెల్యేలతో మాట్లాడనని కుమార స్వామి చెప్పారు. మరోవైపు ఫోన్‌లోకి టచ్‌లోకి రానంత మాత్రాన బీజేపీలో చేరినట్లు కాదన్నారు పరమేశ్వర. వారంతా కుటుంబ సభ్యులతో కలిసి టూర్లకుగానీ, గుళ్లకుగానీ వెళ్లి ఉంటారని చెప్పుకొచ్చారు…

అటు కాంగ్రెస్ నేతల ఆరోపణలను బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ క్యాంపు వెళ్లారనడం పూర్తిగా అవాస్తవం అంటున్నారు. పాలించడం చేతగాక ఇలాంటి ఆరోపణలు చేయడం కాంగ్రెస్‌కు కొత్తకాదన్నారు.

నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు కర్నాటక రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత డ్రామా మొదలైంది. అత్యధిక సీట్లు గెల్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ… అసెంబ్లీలో బలనిరూపణ జరగకముందే యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జేడీఎస్‌కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో కుమార స్వామి దశ తిరిగింది. పాతిక సీట్లు గెలిచిన జేడీఎస్ అధినేత కుమార స్వామికి సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు.

అధికారం కోల్పోయిన బీజేపీ ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టలేదు. రెండు మూడు నెలల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ అప్పుడే ఆ పార్టీ నేతలు జోస్యం చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని పడగొట్టే దిశగా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అప్పట్లోనే కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ వల వేసే ప్రయత్నం చేసింది. కానీ చాకచక్యంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జాగ్రత్తపడింది. కానీ ఎమ్మెల్యే రమేష్ జర్కిహోలిపై వేటు వేయడం బీజేపీకి కలిసి వచ్చినట్లు భావిస్తున్నారు.

కర్నాటక అసెంబ్లీలో మొత్తం 225 స్థానాలున్నాయి. అధికారం చేపట్టాలంటే కావల్సిన సంఖ్యాబలం 113 మంది ఎమ్మెల్యేలు. ప్రస్తుతం బీజేపీ బలం 104. ఇక కాంగ్రెస్, జేడీయూకు కలిపి 117 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ అధికారాన్ని చేపట్టాలంటే మరో 9 మంది ఎమ్మెల్యేలు అవసరం అవుతారు. అయితే బీజేపీ 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం కుమార స్వామిపై వ్యతిరేకత ఉన్న 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. వీరిలో ఇప్పటికే ముగ్గురు బీజేపీ క్యాంపు వెళ్లడంతో సంక్రాంతి తర్వాత కర్నాటకలో ప్రభుత్వం మారే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.