శబరిగిరుల్లో మకరజ్యోతి దర్శనం..ఊపిరి పీల్చుకున్న ప్రభుత్వం

makara-jyothi
makara-jyothi

శబరిగిరుల్లో మకరజ్యోతి దర్శనమిచ్చింది. మకర జ్యోతి దర్శనంతో భక్తులు పులకించిపోయారు. స్వామియే శరణం అంటూ శరణు ఘోషతో శబరిమల మారుమోగింది.

శబరిమలలో మకర జ్యోతి భక్తులకు దర్శనమిచ్చింది. సరిగ్గా సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు పొన్నాంబలమేడ కొండపై నుంచి ప్రకాశవంతంగా వెలుగుతూ మకర జ్యోతి దర్శనమిచ్చింది.

తేజోవంతమైన మకరజ్యోతిని చూసిన అయ్యప్ప భక్తులు పులకించిపోయారు. కొన్ని సెకన్లపాటు కనిపించిన జ్యోతిని చూసి భక్తులు తన్మయత్వంతో మైమరిచిపోయారు. మకర జ్యోతిని చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ శరణు గోషతో శబరిగిరులు మారుమోగాయి

జ్యోతి దర్శనానికి ముందు స్వామివారి తిరువాభరణాలను సాయంత్రం 6 గంటలకు సన్నిధానానికి తరలించారు ఆలయ రాజవంశీయులు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు దీపారాధనతో తిరువాభరణ ఘట్టం పూర్తయింది. అనంతరం పొన్నాంబలమేడు నుంచి జ్యోతి రూపంలో అయ్యప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు

పంబానది, సన్నిధానం, హిల్‌టాప్‌, టోల్‌ప్లాజా వద్ద మకర జ్యోతి దర్శనం కోసం ట్రావెన్‌కోర్‌ దేవస్థానం ఏర్పాట్లు చేసింది. భక్తులు ఈనెల 19వరకు అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వీలు కల్పించారు. ఈనెల 20న పందళ రాజవంశీకులు స్వామివారి దర్శనం తర్వాత ఆలయం మూసివేస్తారు

గత నాలుగు నెలలుగా మహిళల ఆలయ ప్రవేశం విషయంలో తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో మకరజ్యోతి ఘట్టం ప్రశాంతంగా పూర్తి కావడంతో ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డు, అటు కేరళ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.