చాలా మంది ఫూల్స్.. కన్యనే భార్యగా వచ్చిందనుకుంటారు కానీ.. – ఓ ప్రొఫెసర్

kanak-sarkar
kanak-sarkar

వర్జిన్‌పై ఓ ప్రొఫెసర్ చేసిన కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి. ఫేస్‌బుక్‌లో ఆ ప్రొఫెసర్ పెట్టిన పోస్టు క్షణాల్లో వైరల్ అయింది. దీంతో వెంటనే ఆయన పోస్టును డిలీట్ చేశారు. కానీ అది వైరల్ కావడం ఆగలేదు. ప్రొఫెసర్ తీరుపై మహిళా సంఘాలు, వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని, ఇలాంటివి రాసే స్వేచ్ఛ తనకు ఉందని సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు.

వర్జిన్ బ్రైడ్- వై నాట్? అనే హెడింగ్ కింద ప్రొఫెసర్ కనక్ సర్కార్ చేసిన కామెంట్లు అగ్గిరాజేశాయి. బెంగాల్‌లోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ-జేయూలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు కనక్ సర్కార్. గత రెండు దశాబ్దాలుగా ఆయన ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి బోధిస్తున్నారు. అలాంటి ప్రొఫెసర్… వర్జిన్‌ను సీల్డ్ బాటిల్‌తో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఎవరైనా సీల్ విప్పిన బాటిల్‌ను కొనాలనుకుంటారా అంటూ యువకుల మనసులో అనుమానాలు రేకెత్తించాలా ఆ పోస్టులో రాశారు

ప్రొఫెసర్ కనక్ సర్కార్ పెట్టిన వివాదాస్పద పోస్టు క్షణాల్లో వైరల్ అయింది. జాదవ్‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఇతర వర్గాలు, మహిళా సంఘాల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో వెంటనే ఆయన ఫేస్‌బుక్ నుంచి పోస్టును డిలీట్ చేశారు. అయినప్పటికీ ఆ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రొఫెసర్ పోకిరీ మైండ్ సెట్‌ బయటపడిందంటూ కొందరు, విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ప్రొఫెసరే ఇలాంటి కామెంట్లు చేస్తారా అంటూ మరికొందరు మండిపడుతున్నారు.

వ్యాల్యూ ఓరియంటెడ్ సోషల్ కౌన్సెలింగ్ ఫర్ ఎడ్యుకేటెడ్ యూత్ పేరుతో ప్రొఫెసర్ కనక్ సర్కార్ గత కొంతకాలంగా పోస్టులు పెడుతున్నారు. అయితే వివాదాలు ఆయనకు కొత్తకాదు. గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద కామెంట్లు చేశారు. చాలా మంది యువకులు మూర్ఖులు. కన్యనే భార్యగా తెచ్చుకుంటున్నామనే భ్రమలో ఉంటున్నారు అంటూ అనుమానాలు రేకెత్తించేలా ఆ పోస్టులో రాశారు. అంతేకాదు కన్యను దేవకన్యగా అభివర్ణించారు. కన్యత్వం అనేది నైతిక విలువలు, సంస్కారం, సంప్రదాయం అంటూ చెప్పుకొచ్చారు..

ఇలాంటి కామెంట్లు సరికాదని, ఆ ఫ్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రొఫెసర్ కనక్ సర్కార్ మాత్రం తన పోస్టును సమర్ధించుకుంటున్నారు. తను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని మరో పోస్టు పెట్టారు. పైగా రీసెర్చ్ చేసి రాస్తున్నానని, దీనితో యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఐటీ చట్టంలోని 66-A సెక్షన్ కల్పించిన స్వేచ్ఛను ఉపయోగించుకుని తన వ్యక్తిగత అభిప్రాయం వెల్లడిస్తున్నానంటూ కనక్ సర్కార్ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్లపై యూనివర్సిటీ… ప్రొఫెసర్ కనక్ సర్కారుపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.